కుతుబ్‌షాహీ సమాధుల వద్ద బయటపడిన సొరంగం!

హైదరాబాద్‌లోని 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో రహస్య సొరంగం వెలుగుచూసింది. అక్రమ తవ్వకాలపై ఏఎస్ఐ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో దాదాపు 400 ఏళ్ల పురాతన కుతుబ్‌షాహీ సమాధుల సముదాయంలో సొరంగం బయటపడటం సంచలనం రేపింది. కుతుబ్ షాహా సమాధుల సముదాయం ప్రాంగణంతో అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్న క్రమంలో క్రీడా మైదానంలో ఈ రహస్య సొరంగం వెలుగుచూసింది. క్రీడా మైదానం వ‌ద్ద ర‌హ‌స్య సొరంగం క‌నిపించ‌డంతో అది గోల్కొండ నుంచి చార్మినార్ వ‌ద్ద‌కు వెళ్లే మార్గ‌మే అనే ప్ర‌చారం కూడా మ‌రోసారి జోరందుకుంది. సుల్తాన్ మహమ్మద్ కులీ కుతుబ్‌షా కాలంలో అత్యవసర పరిస్థితుల్లో రాజకుటుంబం బయటకు వెళ్లేందుకు దీనిని నిర్మించినట్లు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

సొరంగం వెలుగు చూసిన సమాచారాన్ని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు ఎమ్మెల్యే కౌసర్‌ మొహియుద్దీన్‌ అర్కియాలాజీ సర్వే ఆఫ్ ఇండియాకు అందించారు. అధికారులు సొరంగం స్థలాన్ని పరిశీలించారు. అక్కడ ఏదైనా పురాతన నిర్మాణం ఉందా అనే అంశాలపై తనిఖీలు చేయనున్నారు. భద్రత కోసం పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్రమ తవ్వకాలపై క్షేత్రస్థాయిలో ఏఎస్ఐ విచారణ జరుపుతుంది. మరోవైపు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని విచార‌ణ జ‌రుపుతున్నారు. ఈ త‌వ్వ‌కాలు ఎవ‌రు జ‌రిపారు? ఎందుకు జ‌రిపారు? అనే కోణంలో విచారిస్తున్నారు. బయటపడిన సొరంగం ఎప్పటిది? దాని నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? గతంలో దీన్ని ఏ ప్రయోజనం కోసం ఉపయోగించారు? ప్రస్తుత తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? అన్న అంశాలపై ఏఎస్ఐ అధికారులు పరిశీలిస్తున్నారు.

Latest News