ప్రభుత్వ పాఠశాలల మూసివేత తగదు.. ప్రైవేటు స్కూళ్లను నియంత్రించాలి

రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరులో ‘ద హిందూ హడల్ కాంక్లేవ్‌’లో ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు, ప్రముఖ కవులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు.

రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను నాలుగు వేలకు కుదిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరులో ‘ద హిందూ హడల్ కాంక్లేవ్‌’లో ప్రకటించడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ విద్యావేత్తలు, మేధావులు, ప్రముఖ కవులు, ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వంద మందికి పైగా వివిధ రంగాలకు చెందిన మేధావులు ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను రాశారు. మంగళవారం (జులై 7, 2026) హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ బహిరంగ లేఖను విడుదల చేశారు. గ్రామీణ ప్రాంతంలో విస్తరించి ఉన్న 23 వేల బడుల మూసివేతను ఉపసంహరించుకోవాలని, విశృంఖలంగా పెరిగిపోతున్న విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణను నియంత్రించాలని, అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టాలని, అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ, సరిపడా టీచర్లను నియమించాలని ఆ లేఖలో డిమాండ్ చేశారు.

హామీలకు భిన్నంగా పాలన

ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని సీనియర్‌ పాత్రికేయులు కే రామచంద్ర మూర్తి అన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు లేరని 23 వేల పాఠశాలల మూసివేసే ఆలోచన తగదని, బడులను కుదిస్తే ప్రజలు విద్యకు దూరం చేసినట్లు అవుతుందని చెప్పారు. నాక్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ విఎస్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో విద్య లేదని కానీ విద్యలో రాజకీయాలు ఎక్కువైపోయాయని విమర్శించారు. ఆ కారణంగానే సామాజిక అవసరాలు గుర్తించకుండా పాఠశాలల మూసివేత ప్రకటన చేశారని దుయ్యబట్టారు.

విద్యార్థుల సంఖ్య తగ్గడంపై అధ్యయనం చేయాలి

జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదనే నెపంతో పాఠశాలల మూసివేత నిర్ణయాలు గైకొనడం సరికాదని వాస్తవానికి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణాలేంటో శాస్త్రీయంగా అధ్యయనం చేశారా అని ప్రశ్నించారు. ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి నరసింహారెడ్డి ప్రసంగిస్తూ విద్యకు 15% నిధులు కేటాయిస్తామని గత ప్రభుత్వ మూసివేసిన 6000 పాఠశాలలను తెరిపిస్తామని తమ మేనిఫెస్టో ద్వారా హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక బడ్జెట్ కేవలం 8.2% మాత్రమే కేటాయించి, ఏకంగా 23 వేల పాఠశాలలను మూసివేస్తామని ప్రకటించడం ప్రజలను వంచించడమేకాగలదన్నారు. కేంద్ర సమాచార కమిషన్ మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ 23 వేల పాఠశాలల మూసివేత ద్వారా ఉత్పన్నమయ్యే పరిణామాలు తల్చుకుంటే భయంగొల్పుతున్నదని చెప్సాపారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి విద్యామంత్రిగా ఉంటూ ఇలాంటి తిరోగమన నిర్ణయాలు తీసుకోవడం పట్ల తన ఆక్షేపణ ప్రకటించారు.

విద్య హక్కు

హైకోర్టు సీనియర్ అడ్వకేట్ చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వము లాగానే నేటి ప్రభుత్వం కూడా ప్రజాస్వామికంగా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ పరిధిలో ప్రజా పాలన అందిస్తామని ప్రకటించి ఏకపక్షంగా 23 వేల పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించడాన్ని తప్పు పట్టారు. ఆర్టిఈ చట్టం ప్రకారం గ్రామానికి పాఠశాల ఉండాలని డిమాండ్ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ కవి రచయిత డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ పాఠశాల మూసివేత ప్రకటన సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. పాఠశాలల పరిరక్షణ, బలోపేతం కోసం ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ప్రొఫెసర్ జి హరగోపాల్ ప్రసంగిస్తూ పాఠశాల మూసివేత ప్రకటన పౌర సమాజాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిందని బడికి గ్రామ ప్రజలకు ఉండే మానవీయ అనుబంధాన్ని తుంచి వేయడం తగదని తక్షణమే ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రొఫెసర్ కే చక్రధర్ రావు మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందినదని, ఎక్కువ బడ్జెట్ కలిగి ఉందని అన్నారు. అయినప్పటికీ విద్యారంగానికి అతి తక్కువ నిధులు కేటాయిస్తున్నారని విమర్శించారు. కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యను విధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలను అదుపు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని జీవో ఎంఎస్ నెంబర్ వన్ మరియు విద్యా హక్కు 1982 నిబంధనల ప్రకారం నియంత్రించలేకపోతున్నదని విమర్శించారు.

ఈ మీడియా సమావేశంలో డాక్టర్ వనమాల, ఫిలిం ప్రొడ్యూసర్ సయ్యద్ రఫీక్, శంకర్ డిబిఎఫ్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్, డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టి లింగారెడ్డి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ ఎం రాఘవాచారి, విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర సహాధ్యక్షులు వై.అశోక్ కుమార్, రాష్ట్ర సహా ప్రధాన కార్యదర్శి ఎం రఘు శంకర్ రెడ్డి, పిడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్, పీడీఎస్‌యూ విజృంభణ అధ్యక్షుడు ఏ విజయ్, టి పి టి ఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ఎం. ప్రకాష్ రావు, బి. ముత్యాలు, విజయ్ కుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Latest News