Yadagirigutta : యాదగిరిగుట్ట సమీపంలోకి పెద్దపులి రాక !
యాదగిరిగుట్ట చెంతన పెద్దపులి పాదముద్రలు! 50 ఏళ్ల తర్వాత యాదాద్రి జిల్లాలోకి పులి రాక. మహారాష్ట్ర నుంచి 375 కి.మీ ప్రయాణించిన మగ పులి.. అటవీశాఖ హై అలర్ట్!
విధాత : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి క్షేత్ర సమీపంలోకి పెద్దపులి రానే వచ్చింది.యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగామ గ్రామ శివారులో ఓ దూడపై పెద్దపులి దాడి చేసింది. యాదగిరిగుట్టకు సమీపంలోని ఈ గ్రామంలో పెద్దపులి సంచారంతో అటవీశాఖ హై అలర్ట్ ప్రకటించింది. జనవరి 17నతేదీన సమీపంలోని తుర్కపల్లి మండలంలో ఇబ్రహీంపూర్ గ్రామంలో పులి పశువులపై దాడి చేయడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి ఉనికి వెలుగుచూసింది.
మహారాష్ట్ర నుంచి యాదగిరి గుట్టకు చేరిన పెద్దపులి
మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్ నుంచి మగ పులి ఆసిఫాబాద్, జగిత్యాల సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, నర్సాపూర్ జిల్లాల మీదుగా యాదాద్రి జిల్లాలోకి వచ్చినట్లుగా గుర్తించారు. 375 కిలోమీటర్లు ప్రయాణించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు పెద్దపులి రావడం 50 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అని ఫారెస్టు అధికారులు వెల్లడించారు. యాదగిరి గుట్ట పరిసర గ్రామాలైన దత్తాయిపల్లి, గంధమల్ల, కోనాపూర్, వీరారెడ్డిపల్లి, ఇబ్రహీంనగర్, వెంకటాపూర్, శ్రీనివాస పూర్ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంతో ఆయా గ్రామాల ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. రైతులు ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. పులి కదలికలను పసిగట్టడానికి అటవీ అధికారులు అడవిలోని పలు బ్లాకుల్లో కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, పులి కనిపించినట్లయితే వెంటనే తమకు తెలియజేయాలని అటవీశాఖ అధికారులు కోరారు.
తెలంగాణలోని 19 జిల్లాల్లో పులులు సంచరిస్తున్నట్లు పాదముద్రల గణనల మేరకు అధికారులు తేల్చారు. మణుగూరు అడవుల్లో, ఏటూరునాగారం అడవుల్లో, లక్సెట్టిపేట, మంచిర్యాల్ అడవుల్లో అయిదారు నెలలుగా పులులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ టైగర్ సెల్ గుర్తించింది. ఒక్కో జిల్లాలో 15 కెమెరా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి పులుల సంచారాన్ని రికార్డు చేయాలని అటవీశాఖ నిర్ణయించింది. నల్లమల అమ్రాబాద్ టైగర్ ఫారెస్టు పరిధిలో పులుల సంఖ్య 36కు చేరినట్లు గత ఏడాది గుర్తించారు. తాజాగా చేపట్టిన వన్యప్రాణుల గణనతో తెలంగాణ పరిధిలో పులులు, ఇతర వన్యప్రాణుల లెక్కలపై స్పష్టత రానుంది.
ఇవి కూడా చదవండి :
Anaconda Movie Making Video : అనకొండ సినిమాను ఎలా తీశారో చూస్తారా!
BRS Boycott ABN : ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌ను బహిష్కరించిన బీఆర్ఎస్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram