దక్షిణ కెన్యాలోని అంబోసెలి నేషనల్ పార్కు సమీపంలో 14ఏనుగులు అనుమానస్పదంగా మరణించడం కలకలం రేపింది. ఏనుగుల మృతికి విష ప్రయోగం కారణమా ? లేక వ్యాధులు, ఇతర కారణాలతో చనిపోయాయా ? అన్న విషయాన్ని తేల్చేందుకు ప్రభుత్వం అత్యవసర దర్యాప్తుకు ఆదేశించింది. నిపుణులు ఏనుగుల కళేబరాలను, అవయవా నమునాలను ల్యాబ్ లకు పంపించినట్లుగా కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ పేర్కొంది. ఏనుగుల మరణాలన్నింటికీ ఒకటే కారణమని సూచించే ఎలాంటి ఆధారాలు ప్రస్తుతానికి లభించలేదని కేడబ్ల్యూఎస్ పేర్కొంది.
టాంజానియా సరిహద్దుకు ఆనుకుని ఉణ్న అంబోసెలి నేషనల్ పార్కు సహా చుట్టు ప్రక్కల ప్రాంతాలలో జంతువుల వేటపై కఠిన ఆంక్షలు అమలులో ఉన్నాయి. ఆ ప్రాంతం చక్కని అడవులతో జీవ వైవిద్యానికి నెలవుగా కొనసాగుతుంది. అలాంటి ప్రాంతంలో ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగుల మరణాలు నమోదు కావడం సంచలనం రేపింది. కొన్ని దశాబ్ధాల తర్వాతా ఇక్కడ వన్యప్రాణుల మరణాలలో ఇదే అతిపెద్ద ఘటనగా అధికారులు చెబుతున్నారు.
ఏనుగుల మృతదేహాలన్నీ అంబోసెలి నేషనల్ పార్క్ సరిహద్దుకు సుమారు 15 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్ల దూరంలో, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించాయని వెల్లడించారు. చనిపోయిన ఏనుగుల్లో వివిధ వయస్సుల్లోని ఆడ, మగ ఏనుగులుండటంతో అవన్ని ఒకే గుంపుకు చెంది ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ‘అంబోసెలి ట్రస్ట్ ఫర్ ఎలిఫెంట్స్’ గణాంకాల ప్రకారం 2025 నాటికి అంబోసెలి ఎకోసిస్టమ్‌లో 2000కు పైగా ఏనుగులున్నాయని అధికారులు తెలిపారు.
