Bangladesh Chief Justice Obaidul Hassan । విద్యార్థుల అల్టిమేటంతో బంగ్లాదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ రాజీనామా

విద్యార్థుల ఉద్యమానికి బంగ్లాదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ సైతం తలొంచక తప్పలేదు. విద్యార్థుల అల్టిమేటం మేరకు చీఫ్‌ జస్టిస్‌ పదవికి జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ శనివారం రాజీనామా చేశారు.

Bangladesh Chief Justice Obaidul Hassan । విద్యార్థుల అల్టిమేటంతో బంగ్లాదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌ ఒబైదుల్‌ హసన్‌ రాజీనామా

Bangladesh Chief Justice Obaidul Hassan । బంగ్లాదేశ్‌ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పదవికి జస్టిస్‌ ఒబైదుల్లా హసన్‌ శనివారం రాజీనామా చేశారు. వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం (Anti-Discrimination Student Movement) నాయకుల అల్టిమేటం (ultimatum) నేపథ్యంలో ఆయన చీఫ్‌ జస్టిస్‌ పదవి నుంచి తప్పుకొన్నారు. ‘పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు హైకోర్టు వద్దకు చేరుకున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చీఫ్‌ జస్టిస్‌ తన నిర్ణయాన్ని వెలువరించారు’ అని ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది. చీఫ్‌ జస్టిస్‌తోపాటు అప్పిలేట్‌ డివిజన్‌లో (Appellate Division) పలువురు ఇతర న్యాయమూర్తులు సైతం రాజీనామాలు చేసినట్టు తెలుస్తున్నది. చీఫ్‌ జస్టిస్‌ నిర్ణయాన్ని తెలియజేస్తూ న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారుల ప్రొఫెసర్‌ అసిఫ్‌ నాజ్రుల్‌ (Prof Asif Nazrul) సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో సందేశం పోస్ట్‌ చేశారని డైలీ స్టార్‌ తెలిపింది. ‘ఈ ప్రత్యేకమైన వార్తను మీతో పంచుకోవటం అవసరమని భావిస్తున్నాను. మన చీఫ్‌ జస్టిస్‌ కొద్ది నిమిషాల క్రితం రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామా లేఖ న్యాయశాఖకు (Law Ministry) చేరింది. తగిన చర్యలు తీసుకునేందుకు దీనిని దేశాధ్యక్షుడికి పంపిస్తున్నాం’ అని ఆయన వీడియో సందేశంలో తెలిపారు.

చీఫ్‌ జస్టిస్‌, అప్పిలేట్‌ డివిజన్‌లోని ఇతర న్యాయమూర్తులు తమ పదవులకు రాజీనామా చేయాలని విద్యార్థి ఉద్యమ సమన్వయకర్తల్లో ఒకరైన హస్నత్‌ అబ్దుల్లా (Hasnat Abdullah) అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ హసన్‌.. శనివారం ఫుల్‌ కోర్టు మీటింగ్‌ (full court meeting) నిర్వహించారు. కానీ.. గంటలోగా రాజీనామా చేయకపోతే కోర్టును దిగ్బధిస్తామని విద్యార్థులు స్పష్టం చేయడంతో ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

2023లో చీఫ్‌ జస్టిస్‌గా ఎంపికైన జస్టిస్‌ హసన్‌.. ప్రధాని షేక్‌ హసీనాకు విశ్వాసపాత్రుడని చెబుతారు. వందల మంది విద్యార్థులు కోర్టు వద్దకు చేరుకోవడంతో బంగ్లాదేశ్‌ ఆర్మీ (Bangladesh Army) సిబ్బందిని భారీగా మోహరించారు. విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన నిర్వహించాలని, ప్రభుత్వ వనరులను వృథా చేయవద్దని వారికి ఆర్మీ సిబ్బంది విజ్ఞప్తి చేశారు.