Barack Obama | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలాహ్యారిస్‌కు ఒబామా దంపతుల మద్దతు
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న కమలా హ్యారిస్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు శుక్రవారం (26.07.2024) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఈ వారంలో మిషెల్లీ, నేను మా స్నేహితురాలు కమలాహ్యారిస్‌కు ఫోన్ చేశాం.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్ల తరఫున పోటీ చేస్తున్న కమలా హ్యారిస్‌కు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు శుక్రవారం (26.07.2024) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘ఈ వారంలో మిషెల్లీ, నేను మా స్నేహితురాలు కమలాహ్యారిస్‌కు ఫోన్ చేశాం. ఆమె అద్భుతమైన అమెరికా అధ్యక్షురాలు కాగలరని మేం భావిస్తున్నట్టు చెప్పాం. అందుకోసం ఆమెకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలియజేశాం. దేశానికి అత్యంత కీలకమైన ఈ దశలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఆమె విజయానికి మేం ఏం చేయగలమో అంతా చేస్తాం. మీరు కూడా మాతో భాగస్వాములు కండి’ అని ఒబామా ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘కమలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉన్నది. డెమోక్రటిక్ నామినీగా ఆమెను బలపరచడం ఉత్తేజాన్నిస్తున్నది. ఆమె పాజిటివిటీ, సెన్సాఫ్ హ్యూమర్, దేశ ప్రజలందరి జీవితాల్లో ఒక కాంతిని తీసుకురావడంలో ఆమెకు ఉన్న సామర్థ్యాలే అందుకు కారణం. మీకు మద్దతుగా మేం ఉన్నాం’ అని మిషెల్లీ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష బరి నుంచి డెమోక్రటిక్ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదిలిగి, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని పొందేందుకు తగినంత మంది ప్రతినిధుల మద్దతును కమలా హ్యారిస్ (59) పొందారు. హిల్లరీ క్లింటన్ కోసం 2016 ఎన్నికల్లో, బైడెన్ కోసం 2020 ఎన్నికల్లో బరాక్ ఒబామా, మిషెల్లీ ఒబామా విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. ఎన్నికల తేదీకి ముందరి వారాంతాల్లో భారీ బహిరంగ సభల్లో కూడా ప్రసంగించారు.
వయో భారం రీత్యా రెండోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలువొద్దని డెమోక్రాట్ల నుంచి తీవ్ర ఒత్తిడిని బైడెన్ ఎదుర్కొన్నారు. ప్రత్యేకించి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన తొలి డిబేట్‌లో పేలమైన ప్రదర్శన కూడా ఆయనపై మరింత ఒత్తిడి పెంచింది. ప్రస్తుతం బైడెన్ వయసు 81 ఏళ్లు. ఈ వయసులో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో గెలవలేరన్న అనుమానాలను పలువురు డెమోక్రాట్లు వ్యక్తం చేశారు. ఒబామా రెండు విడుతల పాలనలో ఆయనకు ఉపాధ్యక్షుడిగా బైడెన్ పనిచేశారు. ఆ సమయంలోనే ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎక్కువ ప్రాముఖ్యం పొందారు.