హత్యాచారాలు, అవయవ ఛేదనలు.. పోస్ట్‌మార్టంలలో నిర్ఘాంతపోయే నిజాలు

- హమాస్ దురాగతాలకు సాక్ష్యంగా మృతదేహాలు
- గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ ప్రతిఘటన
- తమ పాలిట ఒసామా బిన్ లాడెన్‌ను తుదముట్టిస్తామని ప్రతిజ్ఞ
విధాత: హమాస్ దళాల అకృత్యాలకు గురై ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు ఇజ్రాయెల్ (Israel Hamas Conflict) సైన్యం పోస్ట్‌మార్టం చేయిస్తోంది. వీటి ఫలితాలు వెలువడుతూ ఉండగా అందులోని వివరాలు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. సైన్యానికి చెందిన ఫోరెన్సిక్ బృందం వెల్లడించిన వివరాల ప్రకారం… చనిపోయే ముందు ఒక్కొక్కరినీ కిరాతకంగా హింసించడం, హత్యాచారాలు చేయడం ఇంకా చెప్పలేని విధంగా హింసించారని తెలుస్తోంది.
కొన్ని మృతదేహాలు అవయవాలు లేకుండా పడి ఉండగా. మరికొన్నింటికి తల మొండెం వేరు చేసినట్లు ఉన్నాయి. సెంట్రల్ ఇజ్రాయెల్‌లో ఉన్న రమ్లా ఆర్మీ బేస్‌లో ఈ పోస్ట్‌మార్టం ప్రక్రియ వేగంగా సాగుతోంది. తమ దగ్గరకు వచ్చిన మృతదేహాల్లో 90 శాతానికి పైగా దేహాలపై భౌతిక దాడి జరిగిందని ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న మాజీ సైన్యాధ్యక్షుడు రబ్బీ ఇజ్రాయెల్ వీస్ వెల్లడించారు. ప్రస్తుతం వారి గుర్తింపును కనుగొనే ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు.
మరోవైపు పోరు మొదలై రెండో వారానికి చేరుకున్న తరుణంలో తమపై హమాస్ దాడికి వెనుకఉన్న వ్యూహకర్తలను ఇజ్రాయెల్ గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా హమాస్ నాయకుడు యహ్యా సిన్వార్‌ను తుదముట్టించడానికి ప్రణాళిక రచిస్తోంది. అతడి జాడను కనుగొనడానికి గాజాలో బలగాలు జల్లెడ పడుతున్నాయి. అతడిని తమ దేశం పాలిట ఒసామా బిన్ లాడెన్ ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఎవరైతే ఇజ్రాయెల్‌పై పూర్తి స్థాయిలో తిరగబడాలని చూస్తారో… వారు తమ చావును ఆహ్వానించినట్లేనని లెప్ట్‌నెంట్ కల్నల్ పీటర్ లెర్నర్ వ్యాఖ్యానించారు.
యన్యా సిన్వర్ గతాన్ని ఒక సారి పరిశీలిస్తే.. అతడు సుమారు 24 ఏళ్లు ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీగా ఉన్నాడు. అయినా హమాస్‌లో తన పట్టును నిలుపుకొంటూ వచ్చాడు. ఇతణ్ని అమెరికా సైతం ఉగ్రవాదిగా గుర్తించింది. ప్రస్తుతం గాజాలో హమాస్ కార్యకలాపాలను ఇతడే నియంత్రిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్, ఖతర్ ప్రభుత్వాలతో నేరుగా సంబంధాలు ఉండటంతో ఇతడు ఎప్పుడూ పటిష్ఠ భద్రతా వలయంలో ఉంటాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఇప్పటికే ఒక విమానవాహక నౌకను పంపిన అమెరికా.. మరో నౌకనూ పంపడానికి అంగీకరించింది. యూఎస్ఎస్ ఐసన్ హోవర్, దాని అనుబంధ యుద్ధ నౌకలు మధ్యధరా సముద్రంలో లంగరు వేస్తాయని అమెరికా ప్రకటించింది. అమయాకులకు కనీస అవసరాలు అందేలా చూడాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు జోర్డాన్, ఈజిప్ట్, ఐరాసలో బైడెన్ చర్చించినట్లు వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయెల్ – హమాస్ పోరులో రోడ్డు మీద పడిన పౌరులకు సహాయంగా 2 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డిస్నీ ప్రకటించింది.