Trump Tariff : టార్గెట్ ఇండియా..బ్రాండెడ్ ఔషధాలపై 100 శాతం సుంకాలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రాండెడ్ ఔషధాలపై 100% సుంకాలు ప్రకటించారు. భారత్ ఫార్మా ఎగుమతులకు ఇది పెద్ద దెబ్బగా మారనుంది.

న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాలపై మరో బాంబు పేల్చారు. ఈసారి ఫార్మా దిగుమతులపై భారీగా సుంకాలు విధించారు. బ్రాండెడ్ లేదా పేటెంటెడ్ ఔషధాలపై ఏకంగా 100 శాతం విధిస్తామని స్పష్టం చేశారు. అమెరికాలో ప్లాంట్‌లను నిర్మిస్తున్న విదేశీ ఔషధ తయారీ సంస్థలకు సుంకాలు వర్తించవని పేర్కొన్నారు. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొస్తామని ట్రూత్ సోషల్ మీడియా ద్వారా ట్రంప్ తెలిపారు.
అలాగే అప్‌హోస్టర్డ్ ఫర్నిచర్‌పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం దిగుమతి సుంకాలు, బాత్రూమ్ క్యాబినెట్‌లపై 50శాతం సుంకాలలు విధించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే రష్యా చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించడంతో ..అత్యధిక సుంకం భరిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. తాజాగా ఫార్మా సుంకాల పెంపు భారత్ ఎగుమతులకు మరింత సంకటంగా మారనుంది.
భారత్ లక్ష్యంగానే ట్రంప్ సుంకాలు?
ఫార్మా దిగుమతులపై 100శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రధానంగా ఇండియాను లక్ష్యంగా చేసుకుని తీసుకున్న నిర్ణయంగా కనబడుతుంటున్నారు పరిశీలకులు. అమెరికాలో ఉత్పత్తి ఫ్లాంట్లు ఉన్న ఫార్మా కంపెనీలకు పెంచిన సుంకాల నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని చూస్తే ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అమెరికాకు ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్న కంపెనీలు అధికంగా భారత్ లోనే తమ కంపెనీలు కల్గి ఉండటం గమనార్హం.
అమెరికాకు ఫార్మా దిగుమతుల్లో భారత్ అతిపెద్ద వాటాదారుగా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తంగా 27.9 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో 31 శాతం అంటే.. దాదాపు 8.7 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలు అగ్రరాజ్యానికే వెళ్లాయి. ఇక, ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇప్పటికే 3.7 బిలియన్ డాలర్ల విలువైన ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసిందని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే పరిశ్రమ సంస్థ తెలిపింది. 2024లో భారతదేశం నుంచి రూ.7,72,31 కోట్లు ఫార్మా ఎగుమతులు జరిగాయని..ఇక 2025 మొదటి అర్ధభాగంలో రూ.32,505 కోట్ల విలువైన ఫార్మా ఉత్తత్తులు ఎగుమతి చేసినట్లు వెల్లడించింది.
అమెరికాలో ఉపయోగించే జనరిక్ ఔషధాల్లో 45శాతం, బయోసిమిలర్ ఔషధాల్లో 15శాతం భారత్ సరఫరా చేసినవే. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్, సన్‌ఫార్మా, గ్లాండ్ ఫార్మా వంటి సంస్థల మొత్తం ఆదాయంలో 30-50శాతం అమెరికా మార్కెట్ నుంచే లభిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లతో అమెరికా మార్కెట్‌లో ఈ ఔషధాల ధరలు రెట్టింపు కానున్నాయి.