Indo-Pak War Trump | యుద్ధానికి వెళ్లకుండా భారత్‌, పాక్‌ను బెదిరించా : ట్రంప్‌ మళ్లీ సంచలన వ్యాఖ్యలు

గత మే నెలలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఘర్షణను తానే నివారించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. 250 శాతం టారిఫ్‌ వేస్తానని బెదిరిస్తేనే వాళ్లు యుద్ధానికి వెళ్లలేదని చెప్పారు.

Indo-Pak War Trump | యుద్ధానికి వెళ్లకుండా భారత్‌, పాక్‌ను బెదిరించా : ట్రంప్‌ మళ్లీ సంచలన వ్యాఖ్యలు

Indo-Pak War Trump | ఇండియా, పాకిస్తాన్‌ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి కుండబద్దలు కొట్టారు. ఈ విషయాన్ని భారత ప్రధాని నేరుగా ఖండించని విషయం తెలిసిందే. బుధవారం దక్షిణ కొరియాలో ఆసియా పసిఫిక్‌ సమ్మిట్‌లో ప్రసంగించిన ట్రంప్‌.. రెండు దేశాలపై 250 శాతం టారిఫ్‌లు విధిస్తానని బెదిరించడం ద్వారా యుద్ధాన్ని నిరోధించానని చెప్పారు. ‘మీరు భారత్‌, పాకిస్తాన్‌ను చూసినట్టయితే.. వాళ్లు దానికి (యుద్ధానికి) వెళుతున్నారు. ఏడు విమానాలు కూలిపోయాయి. వాస్తవంగానే వాళ్లు సిద్ధపడ్డారు.’ అని ట్రంప్‌ చెప్పారు. మే నెలలో రాజుకున్న ఘర్షణ కొనసాగితే.. రెండు దేశాలతో వాణిజ్యం నిలిపివేయడమే కాకుండా.. భారీ స్థాయిలో టారిఫ్‌లు విధిస్తానని భారత ప్రధాని మోదీకి, పాకిస్తాన్‌ నాయకులకు ఫోన్‌ చేసి చెప్పానని తెలిపారు. ‘రెండు దేశాలపై 250 శాతం టారిఫ్‌లు విధిస్తానని చెప్పాను. దానర్థం ఇక వాళ్లు ఎప్పుడూ వ్యాపారం చేయలేరు. మీతో బిజినెస్‌ చేయలేమని చెప్పడం చక్కటి మార్గం’ అని ట్రంప్‌ అన్నారు.

గతంలో కూడా ట్రంప్‌ ఇదే తరహా వ్యాఖ్యలు చేసి, భారత్‌, పాక్‌ మధ్య యుద్ధాన్ని నివారించానని చెబుతూ వస్తున్నారు. అయితే.. ఆ వ్యాఖ్యలను భారత్‌ తిరస్కరిస్తున్నది. ట్రంప్‌ చెబుతున్న అవాస్తవమని చెప్పడం కాకుండా.. పాకిస్తాన్‌ తమను బతిమలాడితేనే దాడులు ఆపామని ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించారు. ఈ అంశం భారత రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారింది. ట్రంప్‌ చెబుతున్నది అవస్తవమైతే.. అదే విషయాన్ని నేరుగా చెప్పాలని కాంగ్రెస్‌ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. కానీ.. దీనికి మోదీ స్పందించడం లేదు.

మరోవైపు భారత్‌, పాక్‌ ఘర్షణలో మధ్యవర్తిత్వం నిర్వహించినందుకు ట్రంప్‌నకు కృతజ్ఞతలు తెలిపిన పొరుగుదేశం నేతలు.. ట్రంప్‌ను ఏకంగా నోబెల్‌ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఇరు పక్షాలు తొలుత తన ప్రతిపాదనకు అంగీకరించలేదన్న ట్రంప్‌.. తర్వాత వెనక్కు తగ్గారని ఆసియా పసిఫిక్‌ సమ్మిట్‌లో వెల్లడించారు. ‘ఇరు పక్షాలు మేం యుద్ధం చేసుకుంటాం అన్నాయి. రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసి.. మేం అర్థం చేసుకున్నాం.. అని చెప్పారు. తర్వాత దాడులు ఆపేశారు’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. భారత్‌పై 25 శాతం టారిఫ్‌ విధించిన వాషింగ్టన్‌.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలతో మరో 25 శాతం అదనపు లెవీ విధించారు. ఇప్పటికీ రెండు దేశాల మధ్య ఈ విషయంలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ.. పాక్‌ విషయంలో మాత్రం ట్రంప్‌ భిన్నంగా వ్యవహరించారు. 29 శాతంగా విధించిన టారిఫ్‌ను 19 శాతానికి తగ్గించారు.