Earth quake | రష్యాలో భారీ భూకంపం.. దెబ్బకు బద్దలైన అగ్నిపర్వతం..!

Earth quake | రష్యాలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఆ దేశ తూర్పు తీర ప్రాంతం వణికించింది. ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని బీటలు వారాయి. అయితే ప్రాణనష్టం సంభవించినట్లు ఎలాంటి సమాచారం అందలేదు.

Earth quake | రష్యాలో భారీ భూకంపం.. దెబ్బకు బద్దలైన అగ్నిపర్వతం..!

Earth quake : రష్యాలో ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఆ దేశ తూర్పు తీర ప్రాంతం వణికించింది. ఈ ఘటనలో కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. మరికొన్ని బీటలు వారాయి. అయితే ప్రాణనష్టం సంభవించినట్లు ఎలాంటి సమాచారం అందలేదు. రష్యా కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 5:25 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.0 గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

తూర్పు తీర నగరం పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్‌చట్‌స్కీ (Petropavlovsk-Kamchatsky) కి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉపరితలం నుంచి 18 కిలోమీటర్ల దిగువన ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికలవల్ల భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. తీర ప్రాంత నగరం కావడం, భూకంప తీవ్రత 7.0 గా ఉండటం వంటి కారణాలను దృష్టిలో ఉంచుకుని హొనులులులో గల పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తక్షణమే స్పందించింది. సునామీ హెచ్చరికలు జారీచేసింది.

సునామీ సంభవించే సూచనలేవీ లేకపోవడంతో కొద్దిసేపటి తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. సునామీ సంభవించనప్పటికీ తీర ప్రాంతం అల్లకల్లోలానికి గురైంది. సముద్రం పోటెత్తింది. రెండు మీటర్ల ఎత్తువరకు అలలు ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా తీర ప్రాంతాలను స్థానిక అధికారులు ఖాళీ చేయించారు. భూకంప తీవ్రతకు పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్‌చట్‌స్కీ నగరం సమీపంలో ఉండే షివ్‌లచ్ అగ్నిపర్వతం బద్దలైంది. ఆకాశంలో ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగజిమ్మిందంటే ఈ పేలుడు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అగ్ని పర్వతం బద్దలు కావడంతో పెట్రోపవ్‌లావ్‌స్కీ- కమ్‌చట్‌స్కీ నగరంలోని పలు ప్రాంతాలు బూడిదమయమయ్యాయి. ఈ మార్గంలో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించినట్లు రష్యన్ అధికారిక న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది.