హీట్ అయితున్న హిందూ మహా సముద్రం…భూతాపం లో భారత్
విధాత: భారత్‌లో భూతాపం ప్రభావం తీవ్రంగా ఉంది. మిగతా వాటికన్నా… హిందూ మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల భారత్‌లో భీకర వర్షాలు, వరదలు తప్పవు. ఉష్ణోగ్రతలూ హెచ్చుస్థాయిలోనే నమోదవుతాయి. దక్షిణాసియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని తక్షణమే అడ్డుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇక మనం కట్టడి చేయలేం! రాబోయే పదేళ్లలో కరవు, వడగాల్పులు, కార్చిచ్చులు, తుపాన్లు మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి. వాతావరణ […]

విధాత: భారత్‌లో భూతాపం ప్రభావం తీవ్రంగా ఉంది. మిగతా వాటికన్నా… హిందూ మహాసముద్రంలోనే ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీనివల్ల భారత్‌లో భీకర వర్షాలు, వరదలు తప్పవు. ఉష్ణోగ్రతలూ హెచ్చుస్థాయిలోనే నమోదవుతాయి. దక్షిణాసియాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. దీన్ని తక్షణమే అడ్డుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఇక మనం కట్టడి చేయలేం! రాబోయే పదేళ్లలో కరవు, వడగాల్పులు, కార్చిచ్చులు, తుపాన్లు మరింత వేగంగా, తీవ్రంగా, విస్తృతంగా ఉంటాయి. సముద్ర మట్టాలు పెరుగుతాయి.
వాతావరణ మార్పులపై ఐరాస నియమించిన అంతర ప్రభుత్వ కమిటీ (ఐపీసీసీ) విడుదల చేసిన నివేదిక సారాంశమిది.భూతాపంపై ఐపీసీసీ సోమవారం ఆందోళనకర విషయాలను వెల్లడించింది. వందేళ్లకోసారి సముద్రమట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు… ఈ శతాబ్దం చివరిలో ఆరంభమై ఏటా సంభవిస్తాయని హెచ్చరించింది. సముద్ర మట్టాల పెరుగుదల ఈ శతాబ్దమంతా కొనసాగుతుందని అంచనా వేసింది. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. భూతాపం మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగితే.. తీవ్రమైన వడగాల్పులు, సుదీర్ఘ వేసవి, చలికాలం నిడివి తగ్గడం సంభవిస్తాయని నివేదిక రూపకర్తలు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు మరో 2 డిగ్రీల మార్కు చేరితే తీవ్రత మరింత పెరిగి వ్యవసాయంపైనా, ఆరోగ్యంపైనా పెను ప్రభావం తప్పదని హెచ్చరించారు. ప్రస్తుత భూతాపాన్ని బట్టి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్ర వడగాల్పులు, ఉష్ణోగ్రతలు… ఇక నుంచి పదేళ్లకోసారి నమోదవుతాయని తెలిపారు. భూతాపం మరో డిగ్రీ మేర పెరిగితే ఈ ముప్పు ప్రతి ఏడేళ్లకు రెండుసార్లు ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘భూతాపం పెరుగుదల ఇలాగే కొనసాగితే 2030కి లేదా అంతకుముందే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ హద్దును దాటే ప్రమాదముంది. భూతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుంది’’ అని వారు పేర్కొన్నారు. ప్యారిస్ ఒప్పందం ప్రకారం… భూతాపాన్ని 1.5 డిగ్రీల మేర తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. 2030 నాటికి భూతాపం 1.5 డిగ్రీల మేర పెరిగిపోతుందని ఐపీసీసీ హెచ్చరించింది.
మానవాళికి రుధిర సంకేతం
భూతాపంపై నివేదికను మానవాళికి రుధిర సంకేతంగా ఐరాస అభివర్ణించింది. సమస్త ప్రాణికోటి ప్రకృతి ప్రసాదించిన ఆవాసాలు తీవ్ర విపత్తును ఎదుర్కొంటున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారని పేర్కొంది. మొత్తం 234 మంది శాస్త్రవేత్తలు… 3 వేలకుపైగా పేజీల్లో దీన్ని రూపొందించారు.