ఇప్పుడు మా వంతు – అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక
అమెరికా తన అణుఇంధన స్థావరాలపై చేసిన దాడులు అత్యంత హేయమైనవని, ఇక తామూ ఊరుకోలేమని ఇరాన్ తేల్చిచెప్పింది.

అమెరికా దాడులపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. తమ శాంతియుత అణుఇంధన కేంద్రాలపై చేసిన దాడులకు అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని ఇరాన్ అత్యున్నత అధినేత అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) తీవ్రస్వరంతో హెచ్చరించారు.
అమెరికన్లు ఇంతకుముందెన్నడూ చూడని విధ్వంసాన్ని చూడటానికి సిద్ధంగా ఉండాలని వాషింగ్టన్కు వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రకటన ఇరాన్ ప్రతిఘటనా(Retaliation) తీవ్రతకు అద్దం పడుతోంది. ఎటువంటి కవ్వింపులూ లేకుండా తమపై దాడి చేయడం ఇరాన్ సార్వభౌమత్వం(Sovereignty)పై యుద్ధం చేయడమేననా ఆయన ప్రకటించారు. తమ ప్రతీకార చర్యలలో భాగంగా, వెంటనే హర్ముజ్ జలసంధి(Strait of Hormuz)ని మూసివేస్తామని, అమెరికా నావికాదళంపై దాడులు చేస్తామని ఖమేనీ తెలిపారు.
ఖమేనీ ప్రతినిధి హొస్సేన్ షరియత్మాదరీ ఆగ్రహావేశాలతో మాట్లాడుతూ, ఇప్పుడు తగిన ప్రతిచర్యలు ఆలస్యం లేకుండా చేపట్టడం ఇక మా వంతని ఒక ప్రకటనలో తెలిపారు. బహ్రెయిన్(Bahrain)లో మోహరించి ఉన్న అమెరికా నావికాదళాన్ని సమూలంగా నాశనం చేయడానికి క్షిపణి దాడి చేయాలని తమ బలగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పిన ఆయన, హర్ముజ్ జలసంధిని కూడా వెంటనే మూసేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జలసంధి ప్రపంచ చమురు రవాణా(global oil shipments)కు ఆయువుపట్టులాంటిది. ఇది అన్నిదేశాలపై ప్రభావం చూపించే అవకాశముంది.
కాగా, ఇరాన్ ప్రకటన అనంతరం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అమెరికాపై ఎలాంటి ప్రతిఘటనాచర్యలకు దిగినా, ఈ రాత్రి చూసిందానికంటే అత్యంత భయంకరమైన అనుభవాన్ని చూస్తారని హెచ్చరించారు.