Yahya Sinwar | హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను తుదముట్టించాం : ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ – హమాస్ పోరాటంలో హమాస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్న జరిగిన బాంబు దాడిలో హమాస్ అధినేత యాహ్యా సిన్వర్(Yahya Sinwar) హతమైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(IDF) ధృవీకరించింది.
హమాస్(Hamas) సంస్థ తన అధినాయకుడిని కోల్పోయింది. ఇజ్రాయెల్ (Israel)భూతల పోరాటంలో భాగంగా ఒక భవంతిపై దాడి చేసినప్పుడు ముగ్గురు తీవ్రవాదులు మరణించారని తొలుత ప్రకటించిన ఐడిఎఫ్కు తర్వాత అందులో ఒకరు సిన్వర్ కావొచ్చేమోనన్న అనుమానం రావడంతో డిఎన్ఏ(DNA) పరీక్షలు నిర్వహించారు. దాంతో చనిపోయింది యాహ్యా సిన్వరేనని ఇజ్రాయెల్ ధృవీకరించింది.
దాదాపు 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను బలి తీసుకున్న అక్టోబర్ 2023 ఊచకోత(7/10 Massacre)కు ప్రధాన సూత్రధారి, 250 మంది ఇజ్రాయెల్ పౌరులను ఇంకా బందీలుగా ఉంచుకున్న హమాస్ చీఫ్ యాహ్యా సిన్వర్(61)ను తాము హతమార్చగలిగామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఐడిఎఫ్ ప్రధానాధికారి లెఫ్టినెంట్ కల్నల్ హెర్జీ హలేవీ(Lt. Col. Herzi Halevi) మాట్లాడుతూ, గాజా స్ట్రిప్(Gaza Strip)లో నిన్న జరిగిన ఘర్షణల్లో ఏడాది నుంచీ తమ దళాలు వెతుకుతున్న హమాస్ ఉగ్రవాద సంస్థ నాయకుడు యాహ్యా సిన్వర్‌ను తన దళాలు మట్టుపెట్టాయని, తాను సిన్వర్‌ను హతమార్చిన తమ యుద్ధవీరులను ఇంతకుముందే కలిసి అభినందించానని తెలిపారు.

అంతకుముందు తాము గాజా స్ట్రిప్‌లో ఓ ఆపరేషన్ సందర్భంగా ముగ్గురు తీవ్రవాదులను హతమార్చామని ప్రకటించిన ఐడిఎఫ్, అందులో ఒకరిని యాహ్యాగా అనుమానించి దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.
కొద్ది గంటల తర్వాత యాహ్యా సిన్వర్ మరణాన్ని ఐడిఎఫ్ ధృవీకరించింది. తమ దళాలు ఎంతో చాకచక్యంతో, నిబద్ధతతో పనిచేస్తారని, వారికి అక్కడ యాహ్యా ఉన్నట్లు తెలియకపోయినా, ముగ్గురు తీవ్రవాదులను మట్టుపెట్టడంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారని కొనియాడిన హలేవి, ఇక యాహ్యా సిన్వర్ లేని ప్రపంచం బాగుంటుందని తెలిపారు.
ఈ ఏడాది జులైలో ఇరాన్(Iran) కొత్త అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న అప్పటి హమాస్ అధినేత ఇస్మాయిల్ హనియా(Ismail Haniyeh)ను హతమార్చిన తర్వాత ఆయన స్థానంలో సిన్వర్ హమాస్ అధినేతగా బాధ్యతలు స్వీకరించాడు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram