Israel Strikes Gaza | ట్రంప్ శాంతి పిలుపు తర్వాత కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు

ట్రంప్ శాంతి పిలుపు తర్వాత కూడా ఇజ్రాయెల్ గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో ఇరవైమంది మరణించగా, హమాస్ ట్రంప్ గాజా ప్రణాళికలో ప్రధాన అంశాలకు అంగీకరించింది.

Israel Strikes Gaza | ట్రంప్ శాంతి పిలుపు తర్వాత కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులు

6 Dead as Israel Strikes Gaza Hours After Trump Calls for End to Bombing

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ముగింపు పలకాలని, హమాస్ శాంతి ప్రయత్నాలకు సిద్ధమైందని ప్రకటించిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై మళ్లీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇరవైమంది మరణించినట్లు అల్​జజీరా తెలిపింది. ‘ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక’తో కాల్పుల విరమణ దిశగా కదలికలు మొదలైనప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం పరిమిత దాడులను కొనసాగించడంతో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది.

గాజాలో శనివారం ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆసుపత్రి వర్గాలు తెలిపిన ప్రకారం ఈ దాడుల్లో ఇరవైమంది మరణించారు. గాజా నగరంలోని ఒక ఇల్లు లక్ష్యంగా చేసిన దాడిలో పదిమంది, ఖాన్ యూనిస్‌లో జరిగిన మరో దాడిలో పది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్​లో, హమాస్ ఇప్పుడు శాశ్వత శాంతికి సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్ వెంటనే బాంబు దాడులను ఆపాలి, అప్పుడు మాత్రమే బందీలను సురక్షితంగా విడుదల చేయగలుగుతాం” అని పేర్కొన్నారు.

ట్రంప్ ప్రతిపాదించిన తొలి దశలో ఇజ్రాయెల్ బందీల విడుదల ప్రణాళికను తక్షణమే అమలు చేయడానికి సిద్ధమవుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే, తరువాత వచ్చిన వార్తల  ప్రకారం, ఇజ్రాయెల్ రాజకీయ వర్గాలు సైన్యానికి దాడులను తగ్గించమని మాత్రమే సూచించినట్లు తెలుస్తోంది.

ట్రంప్ ప్రణాళిక ప్రకారం హమాస్ అంగీకరించిన ముఖ్యాంశాలు

  • యుద్ధానికి ముగింపు, ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా వెనక్కు వెళ్లడం
  • ఇజ్రాయెల్ బందీల విడుదలతోపాటు పాలస్తీనా ఖైదీల విడుదల
  • గాజాలో మానవతా సహాయం, ఆసుపత్రులు, రహదారుల పునర్నిర్మాణం
  • గాజా ప్రజల బలవంతపు తరలింపుకు వ్యతిరేకంగా హమాస్ కట్టుబాటు.

అయితే గాజాలో పాలనపై ఎవరు అధికారం చేపట్టాలన్న అంశంపై హమాస్, ట్రంప్ ప్రణాళిక మధ్య కొంత వివాదం ఉంది. ట్రంప్ ప్రణాళిక ప్రకారం “టెక్నోక్రాటిక్ పాలస్తీనా కమిటీ” గాజాను తాత్కాలికంగా పాలిస్తుందని, ఆ అంతర్జాతీయ సంఘానికి ట్రంప్ అధ్యక్షత వహిస్తారని చెప్పబడింది.

హమాస్ మాత్రం “పాలస్తీనా జాతీయ సమ్మతి ఆధారంగా స్వతంత్ర పాలన”కు మాత్రమే అంగీకరిస్తామని తెలిపింది. గాజాలో ఆయుధ విరమణ అంశంపై మాత్రం హమాస్ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు.

2023 అక్టోబర్ 7న హమాస్ దాడుల్లో 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందగా, 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. ఇప్పటివరకు 48 మంది బందీలు గాజాలో ఉన్నారని, వారిలో 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ వెల్లడించింది.

ఇక ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 66,000 మందికి పైగా గాజా పౌరులు మృతి చెందారు. ఆహార కొరత, ఆసుపత్రుల ధ్వంసం, ఆకలి మరణాలు అక్కడ పరిస్థితులను మరింత క్లిష్టం చేశాయి. ట్రంప్ శాంతి ప్రణాళికకు హమాస్ ప్రాథమికంగా స్పందించినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం నుంచి పూర్తి స్థాయి విరమణ జరుగుతుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం ఏర్పడితేనే ఈ “గాజా శాంతి ప్రణాళిక” ఫలిస్తుంది.