Gaza War | ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ కీలక కమాండర్ మొహమ్మద్ సిన్వర్ మృతి!

Gaza War | హమాస్ టాప్ కమాండర్ యహ్యా సిన్వర్ చిన్న తమ్ముడు మొహమ్మద్ సిన్వర్ గత వారం గాజాపై జరిపిన దాడుల్లో (Gaza War) చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ ప్రకటించారు. దేశ పార్లమెంటేరియన్లతో రహస్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘అందుతున్న సంకేతాలను బట్టి.. మొహమ్మద్ సిన్వర్ చనిపోయాడు’ అని తెలిపారు. ఖాన్ యూనిస్‌లోని యూరోపియన్ హాస్పిటల్ కింద హమాస్ నేతలు ఉన్నారని భావించే భూగర్భ ఆవాసాలను ఇజ్రాయెల్ ఆర్మీ టార్గెట్ చేసిందని వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది.
సిన్వర్ మృతదేహం ఖాన్ యూనిస్ సొరంగంలో లభ్యమైనట్టు సౌదీ అరేబియాకు చెందిన బ్రాడ్‌కాస్టర్ అల్ హదత్ పేర్కొన్నది. సిన్వర్ మృతదేహంతోపాటు మరో పది మంది ఆయన సహచరుల మృతదేహాలు కూడా అక్కడ లభించినట్టు తెలిపింది. హమాస్‌కు చెందిన రఫా బ్రిగేడ్ కమాండర్ మొహమ్మద్ షబానా కూడా ఇదే దాడుల్లో చనిపోయి ఉండొచ్చని ఆ చానల్ పేర్కొన్నది. అయితే.. సిన్వర్ మృతిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. ఖాన్ యూనిస్‌పై దాడిలో ఆరుగురు చనిపోయారని, 40 మంది వరకూ గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఎవరి సిన్వర్?
సిన్వర్ అంటే.. చంద్రుని ముఖం అని ఉర్దూలో అర్థం. గత ఏడాది అక్టోబర్‌లో చనిపోయిన యహ్యా సిన్వర్‌కు చిన్న తమ్ముడు మొహమ్మద్ సిన్వర్. అన్న మరణానంతరం ఆయన కీలక బాధ్యతలకు ఎదిగాడు. గాజాలో ఇప్పుడు సాగుతున్న యుద్ధానికి (Gaza War) 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తాజా కారణం. ఈ దాడుల వెనుక వ్యూహకర్త యహ్యా సిన్వర్. మొహమ్మద్ సిన్వర్ 1975లో ఖాన్ యూనిస్‌లో జన్మించాడు. అన్న బాటలో నడిచాడు. 1980 దశకం చివరిలో లేదా.. 1990వ దశకం మొదట్లో హమాస్‌లో చేరాడు. మిలిటెంట్ కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న అభియోగాలపై అతడిని 1991లో ఇజ్రాయెల్ దళాలు అరెస్టు చేశాయి. ఏడాది కంటే తక్కువ సమయం జైల్లో ఉన్నాడు. 1990 దశకంలో రమల్లాలోని పాలస్తీనా అథారిటీ మొహమ్మద్ సిన్వర్‌ను అనేక సంవత్సరాలు జైల్లో పెట్టింది. గాజాలా ఇప్పటికీ బతికి ఉన్న హమాస్ టాప్ కమాండర్లలో ఒకడిగా అతడిని పరిగణిస్తుంటారు.