Muhammad Yunus | బంగ్లా ఆపద్ధర్మ ప్రధానిగా గురువారం ప్రమాణం చేయనున్న మహ్మద్ యూనస్
నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం గురువారం ప్రమాణం చేయనున్నది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వాకెర్ ఉజ్ జమా ప్రకటించారు.

ఢాకా : నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహ్మద్ యూనస్ నాయకత్వంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం గురువారం ప్రమాణం చేయనున్నది. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్ జనరల్ వాకెర్ ఉజ్ జమా ప్రకటించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆర్మీ చీఫ్.. గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ప్రభుత్వం ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉంటారని ఆయన వెల్లడించారు.
ఆర్థిక వేత్త అయిన యూనస్ (84)ను దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం రాత్రి నియమించారు. హింసాత్మక ఆందోళనల నేపథ్యంలో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి, దేశం వదిలి వెళ్లిపోయిన మరుసటి రోజు ఈ నిర్ణయం వెలువడింది.
ఇదిలా ఉంటే.. అంతా శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి హింసకూ పాల్పడవద్దని బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులైన ప్రొఫెసర్ మహ్మద్ యూనస్ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం పారిస్‌లో ఉన్న యూనస్.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేందుకు బంగ్లాదేశ్‌కు తిరుగుపయనమవుతున్నారు. ‘ఈ నవ విజయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన తప్పిదాలతో ఈ విజయాన్ని చేజార్చుకోవద్దు’ అని ఆయన చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితిలో అందరూ సంయమనం పాటించి, అన్ని రకాల హింస, విధ్వంసాలకు దూరంగా ఉండాలి’ అని యూనస్ విజ్ఞప్తి చేశారు. పలు చోట్ల పోలీసులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అందరూ క్రమంగా తమ విధి నిర్వహణను మొదలుపెట్టాలని, శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల నేపథ్యంలో యూనస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. పోలీసులు విధుల్లో లేకపోవడంతో బుధవారం కూడా విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్ల కూడళ్లలో నిలబడి ట్రాఫిక్‌ను నియంత్రించారు.
హసీనా దేశం వదిలి పారిపోయిన నేపథ్యంలో జైలు నుంచి విడుదలైన మాజీ ప్రధాని ఖలీదా జియా.. ఢాకాలో నిర్వహించిన భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించారు. విధ్వంసాలకు స్వస్తిచెప్పి, శాంతిని నెలకొల్పాలని ఆమె పిలుపునిచ్చారు. దేశాన్ని పునర్నించుకుందామని చెప్పారు. హసీనా పాలనా కాలంలో 2018లో ఖలీదా జియాకు 17 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ‘నేను ఇప్పుడు విడుదలయ్యాను. చావో రేవో అంటూ పోరాటంలోకి దిగి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన సాహసులైన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని ఆమె చెప్పారు. ‘దోపిడీ, అవినీతి, తప్పుడు రాజకీయాల నుంచి బయటపడేందుకు ఈ విజయం మనకు కొత్త అవకాశాన్ని ఇస్తున్నది. భాగ్యవంతమైన దేశంగా దేశాన్ని మనం సంస్కరించుకోవాల్సి ఉన్నది’ అని అన్నారు. ఇదిలా ఉంటే.. షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీకి చెందిన 29 మంది మద్దతుదారుల మృతదేహాలను బుధవారం వెలికితీశారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 469కి పెరిగింది.