ఆ గ్రహంపై ఒకప్పుడు నదీనదాలు.. ఇప్పుడేమో ఇలా..

ఆ గ్రహంపై ఒకప్పుడు నదీనదాలు.. ఇప్పుడేమో ఇలా..

భూమిపై కాకుండా ఇంకెక్క‌డైనా జీవం ఉందేమోన‌ని శాస్త్రవేత్త‌లు ఎప్ప‌టి నుంచో ప‌రిశోధ‌న‌లు సాగిస్తున్న విష‌యం తెలిసిందే. అదే క్ర‌మంలో మ‌న చంద‌మామ మీద‌, మ‌న పొరుగునే ఉన్న అంగార‌కుడిపైనా ఒక‌ప్ప‌టి ప‌రిస్థితులు ఎలా ఉండేవోన‌ని తెలుసుకుంటున్నారు. ఇటీవ‌ల వెల్ల‌డైన ప‌రిశోధ‌న ఫ‌లితాల ప్ర‌కారం.. అంగార‌కుడి (Mars) పై ఒక‌ప్పుడు జీవం ఉనికిలో ఉండేద‌ని న‌మ్మ‌డానికి బ‌ల‌మైన ఆధారాలు దొరికాయ‌ని తెలుస్తోంది.


నాసా పంపిన క్యూరియాసిటీ రోవ‌ర్‌ (Curiosity rover) ఇప్ప‌టికే చాలా స‌మాచారాన్ని శాస్త్రవేత్త‌ల‌కు చేర‌వేసింది. ఆ సమాచారాన్ని విశ్లేషించిన (Study) ప‌రిశోధ‌కులు.. మార్స్ ఉప‌రిత‌లంపై ఒక‌ప్పుడు న‌దీ వ్య‌వ‌స్థ బ‌లంగా ఉండేద‌ని గుర్తించారు. అవి మంచి నీటి న‌దులేన‌ని.. జీవం ఏర్ప‌డ‌టానికి కావాల‌సిన ప‌రిస్థితులు సృష్టించే ప‌రిస్థితి వాటికి ఉంద‌ని పేర్కొన్నారు. ఈ ప‌రిశోధ‌న వివ‌రాలు జియోఫిజిక‌ల్ రీసెర్చ్ లెట‌ర్స్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి.


క్యూరియాసిటీ రోవ‌ర్ పంపిన ఫొటోల‌ను ఒక‌దానికొక‌టి జ‌త చేసి ప‌రిశీలించాం. ఆ త‌ర్వాత భూమిపై ఉన్న గ‌ల్ఫ్ ఆఫ్ మెక్సికో భూగ‌ర్భ ప‌టలాన్ని దానితో పోల్చి చూశాం. ఆ ప‌రిశోధ‌నల ఫ‌లితంగా అంగార‌కుడు కూడా న‌దీన‌దాలు ఉన్న ఒక గ్ర‌హ‌మే అని నిర్ధారించుకున్నాం అని ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన పెన్ స్టేట్ యూనివ‌ర్సిటీకి చెందిన జియోసైంటిస్ట్ బెంజ‌మ‌న్ కార్డ్‌నాస్ వెల్ల‌డించారు. న‌దులు ఒంపులు తిరిగిన‌పుడు, కోత‌కు గురిచేసిన‌పుడు, కొండ‌ల్ని తొలిచిన‌పుడు భూమిపై ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో.. అవే మార్పుల‌ను మార్స్‌పైనా శాస్త్రవేత్త‌లు గుర్తించారు.


అంగార‌కుడిపై న‌దులు ఉండేవ‌ని గ‌తంలోనే తెలిసిన‌ప్ప‌టికీ.. ఆ న‌దుల విస్తృతి చాలా పెద్ద‌ద‌ని ఈ అధ్య‌య‌నంలోనే బ‌య‌ట‌ప‌డింది. ఈ ప‌రిశోధ‌న‌ల ఫ‌లితాలు భూ గోళ‌ భ‌విష్యత్తును అంచ‌నా వేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు. న‌దీ వ్య‌వ‌స్థ ఎంతో బ‌లంగా ఉన్న అంగార‌కుడు ఇప్పుడు నిర్జీవ‌మైపోగా.. భూమిపై అటువంటి ప‌రిస్థితులు ఎప్పుడొస్తాయి.. ఎలా రావొచ్చు అనే అంశాలు తెలిసే అవ‌కాశ‌ముంది.


త‌ద్వారా ముందు జాగ్ర‌త్త ప‌డేందుకు అవ‌కాశ‌ముంటుంది. ఇదిలా ఉండ‌గా అంగార‌కుడిపై నీటి జాడ‌ల‌ను మొద‌ట క‌నిపెట్టిన‌ది మెరైన‌ర్ 9 అనే ఉప‌గ్ర‌హం. ఇది 1971లోనే మార్స్ ఫొటోలు తీసి పంపింది. ఈ ఫొటోల్లో ఎండిపోయిన న‌ది లాంటి ఆకారాలు శాస్త్రవేత్త‌ల‌కు క‌నిపించ‌డంతో అక్క‌డ ఒకప్పుడు న‌దులు ఉండేవ‌ని మాన‌వాళికి చూచాయిగా తెలిసింది.