Nobel Peace Prize 2025 | వెనిజువెలా పోరాట యోధురాలు మరియా కొరీనా మచాడోకు నోబెల్ ‘శాంతి’
వెనిజులా ప్రజాస్వామ్య నేత మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అణచివేత మధ్య ప్రజాస్వామ్యాన్ని కాపాడిన ధైర్యవంతురాలు, శాంతి మార్గంలో నడిచిన స్ఫూర్తి నాయకురాలు.

ఒస్లో, అక్టోబర్ 10 (విధాత):
వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమ నాయకురాలు మరియా కొరీనా మచాడో(Maria Corina Machado)కు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం అణచివేత మధ్య కూడా వెనుకడుగు వేయని ఆమెను నోబెల్ కమిటీ “చీకటిలో ప్రజాస్వామ్య దీపాన్ని వెలిగించిన యోధురాలి”గా కొనియాడింది. ఆమె చూపిన ధైర్యం, నిబద్ధత, మరియు హింసకు బదులుగా శాంతిమార్గం ఎంచుకున్న నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.
అణచివేత మధ్య వెలిగిన ఆశా దీపం
1967లో కారాకస్‌లో జన్మించిన మచాడో ఇంజినీరింగ్ విద్యార్థిని. 1992లో ఆమె ‘అతెనియా ఫౌండేషన్ – Atenea Foundation ’ను స్థాపించి వీధి పిల్లల సంక్షేమం కోసం పనిచేసింది. 2002లో ‘సుమాతే Sumate’ అనే సంస్థను స్థాపించి స్వేచ్ఛా ఎన్నికల కోసం ప్రజలను సంఘటితం చేసింది. 2010లో పార్లమెంటు సభ్యురాలిగా రికార్డు ఓట్లతో ఎన్నికైన ఆమెను 2014లో ప్రభుత్వం బహిష్కరించినా తను ఆగలేదు. 2017లో ‘Soy Venezuela’ వేదికను ఏర్పాటు చేసి ప్రతిపక్ష శక్తులను ఒకతాటిపైకి తెచ్చింది. 2023లో అధ్యక్ష అభ్యర్థిగా నిలిచినా, ప్రభుత్వ నిషేధంతో పోటీ చేయలేకపోయింది. అయినా మరో అభ్యర్థి ఎడ్ముండో గోన్సాలెజ్ ఉర్రుతియాకు మద్దతు ఇచ్చి ప్రజాస్వామ్య పోరాటాన్ని కొనసాగించింది. ఎన్నికల సమయంలో వందలాది మంది వాలంటీర్లు ఆమె పిలుపుతో బూత్‌ల వద్ద కాపలా కాశారు. హింస, బెదిరింపులు మధ్య కూడా ఓటు హక్కు, నిజాయితీ గల ఎన్నికల కోసం ఆమె నిలిచిన తీరు ప్రపంచాన్ని ఆకట్టుకుంది.
నోబెల్ బహుమతిపై “నేను కేవలం ఒక వ్యక్తిని మాత్రమే… ఈ గౌరవం నాది కాదు, నా ప్రజలది,” అని ఆమె భావోద్వేగంతో స్పందించింది.
ధైర్యం, నిబద్ధత – ప్రపంచ ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి
మచాడో ప్రజాస్వామ్య హక్కుల కోసం అచంచలంగా నిలిచి, హింసకంటే శాంతి శక్తివంతమని నిరూపించిందంటూ నోబెల్ కమిటీ తెలిపింది.
ఈ నిర్ణయానికి ప్రపంచ నాయకుల నుంచి విస్తృత స్పందన వచ్చింది.
యూరోపియన్ యూనియన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ స్పందిస్తూ, “ఇది మచాడో ధైర్యానికే కాదు, మౌనంగా ఉండలేని ప్రతి స్వరానికి గౌరవం. స్వాతంత్రేచ్ఛను జైలులో పెట్టలేరు,” అని వ్యాఖ్యానించారు. జర్మనీ ప్రభుత్వం కూడా ఆమెను అభినందిస్తూ, “ప్రజాస్వామ్యం, న్యాయం, మానవ హక్కుల కోసం దీర్ఘకాలం పోరాడుతున్న మచాడోకు సరైన గుర్తింపు ఇది” అని తెలిపింది.
అయితే వైట్ హౌస్ మాత్రం విమర్శాత్మకంగా స్పందించింది. ట్రంప్‌ను ఎంపిక చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ,“నోబెల్ కమిటీ శాంతికి కంటే రాజకీయాలకు ప్రాధాన్యం ఇచ్చింది,” అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చ్యూంగ్ వ్యాఖ్యానించారు.
అయినా అంతర్జాతీయ సమాజం మాత్రం ఏకమై మచాడోకు మద్దతుగా నిలిచింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కార్యాలయం , “ఈ బహుమతి వెనిజులా ప్రజల స్వేచ్ఛా ఆకాంక్ష, ప్రజాస్వామ్య దిశగా వారి తపనకు ప్రతీక.” అని అభినందించింది. మచాడో జీవితం ప్రపంచానికి ఒక పాఠం శాంతి అంటే బలహీనత కాదు, అది ధైర్యం. ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యం ఎప్పటికీ ఉనికి కోల్పోదని మచాడో చూపిన దిశ మనకు గుర్తు చేస్తోంది.