చెట్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలిసింది.. వీడియో విడుద‌ల చేసిన శాస్త్రవేత్త‌లు

మ‌నుషుల్లాగే చెట్లు, మొక్క‌లు (Plants Conversation) కూడా ఏదైనా ఆప‌ద ఎదురైన‌ప్పుడు ఒక‌దానితో ఒక‌టి సంభాషించుకుంటాయ‌ని, హెచ్చ‌రించుకుంటాయ‌ని మ‌న‌కు తెలిసిందే

చెట్లు ఎలా మాట్లాడుకుంటాయో తెలిసింది.. వీడియో విడుద‌ల చేసిన శాస్త్రవేత్త‌లు

మ‌నుషుల్లాగే చెట్లు, మొక్క‌లు (Plants Conversation) కూడా ఏదైనా ఆప‌ద ఎదురైన‌ప్పుడు ఒక‌దానితో ఒక‌టి సంభాషించుకుంటాయ‌ని, హెచ్చ‌రించుకుంటాయ‌ని మ‌న‌కు తెలిసిందే. 1980ల నాటికే శాస్త్రవేత్త‌లు ఈ విష‌యాన్ని నిర్ధ‌రించారు. అయితే ఆ ప్ర‌క్రియ ఎలా జ‌రుగుతుంద‌న్న‌ది మాత్రం ఒక మిస్ట‌రీలా మిగిలిపోయింది. దానిని జ‌పాన్ (Japan) శాస్త్రవేత్త‌లు ఛేదించారు. అంతే కాకుండా ఆ వీడియోను సైతం రికార్డు చేసి మొక్క‌ల్లో స‌మాచారం ఎలా బ‌ట్వాడా అవుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. సైటామా యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు చేసిన ఈ అధ్య‌య‌నం (Study) వివ‌రాలు నేచ‌ర‌ల్ క‌మ్యునికేష‌న్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురిత‌మ‌య్యాయి. ప‌రిశోధ‌న వారు రెండు ర‌కాల మొక్క‌ల‌ను ఎన్నుకొన్నారు.


సాధార‌ణ ట‌మాటా, ఒక ర‌కం గంజాయిని ఉత్ప‌త్తి చేసే అరాబిడోప్సిప్ అనే మొక్క. వీటికి హాని క‌లిగించ‌డం ద్వారా స‌మీపంలోనే ఉండే ఈ ర‌కం మొక్క‌ల్లో ఏఏ మార్పులు క‌న‌ప‌డుతున్నాయి, ఆప‌ద‌ను ఎదుర్కొంటున్న మొక్క‌లు ఎలా హెచ్చ‌రిక‌లు పంపుతున్నాయి వంటి విష‌యాల‌ను ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ముందుగా ట‌మాటా, అరాబిడోప్సిన్ మొక్కల‌ ఆకుల‌పై గొంగ‌లి పురుగుల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. ఇవి మొక్క‌ల‌కు హాని చేసే జీవుల‌ని తెలిసిందే. ఇవి మొక్క‌ల‌పైకి వ‌చ్చీ రాగానే స‌మీపంలోనే ఉన్న వేరే అరాబిడోప్సిస్‌, ట‌మాటా మొక్క‌ల‌కు సిగ్న‌ళ్లు వెళ్లిపోయాయి. ఈ సుర‌క్షిత మొక్క‌ల‌ను జెనిటిక‌ల్లీ ఇంజినీరింగ్ ప‌ద్ద‌తుల్లో త‌యారుచేయ‌డంతో.. వీటికి బ‌యోసెన్స‌ర్ల‌ను అమ‌ర్చారు. మొక్క‌లో కాల్షియం అయాన్లను గుర్తిస్తే ఈ సెన్స‌ర్లు ఆకుప‌చ్చ రంగులో ప్ర‌కాశించేలా ఏర్పాట్లు చేశారు. శాస్త్రవేత్త‌లు విడుద‌ల చేసిన వీడియోలో ఆప‌ద‌లో ఉన్న మొక్క‌ల హెచ్చ‌రిక‌ల‌కు స‌మీపంలో ఉన్న మొక్క‌లు ప్రతిస్పందించ‌డం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

వాటి ఆకుల్లో కాల్షియం మోతాదు పెరిగి సెన్స‌ర్లు ఆకుప‌చ్చ రంగులో వెల‌గ‌డం తెలుస్తోంది. ఆప‌ద‌లో ఉన్న మొక్క‌ల ఆకుల‌పై గొంగ‌లిపురుగుల‌ను తీసేస్తే ఈ వెలుగులు ఆగిపోతున్నాయి. జెడ్‌-3-హెచ్ఏఎల్‌, ఇ-2-హెచ్ఏఎల్ అనే మూల‌కాలు కాల్షియం సిగ్న‌ల్స్‌ను ఉత్ప‌త్తి చేస్తున్నాయ‌ని శాస్త్రవేత్త‌లు గుర్తించారు. మొక్క‌ల్లో ఉండే గార్డ్ సెల్స్‌, మెసోఫిల్ సెల్స్‌, ఎపిడెర్మ‌ల్ సెల్స్.. ఆప‌ద‌ను ముందుగా గుర్తిస్తున్నాయ‌ని ప‌రిశోధ‌న‌లో తేలింది. ఒక క‌నిపించ‌ని నెట్వ‌ర్క్ ఏదో మొక్క‌ల మధ్య ఉంద‌ని.. దాని ద్వారానే ప‌లు మూల‌కాల‌ను ఉత్తేజితం చేయ‌డం ద్వారా మొక్క‌ల‌కు హెచ్చ‌రిక‌లు వెళుతున్నాయ‌ని అధ్య‌య‌నానికి నేతృత్వం వ‌హించిన మ‌సాత్సుగా ట‌యోటా అభిప్రాయ‌ప‌డ్డారు.