US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?

US Army | అమెరికా రక్షణ శాఖ తమ సైన్యం నుంచి 90000 మందిని తప్పించే యోచన చేస్తున్నదని మిలటరీ డాట్‌కామ్ అమెరికా రక్షణ శాఖ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రక్షణ శాఖ ఈ ప్రతిపాదన చేస్తున్నట్టు ఆ అధికారులు వెల్లడించారు. సైనికుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,50,000 మంది నుంచి 3,60,000 మందికి తగ్గించే యోచన చేస్తున్నట్టు వారు తెలిపారు. వీరు రిజర్వు ఆర్మీలోని వారా లేక నేషనల్ గార్డ్సా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. మధ్య ఆసియా, ఆఫ్రికా దేశాల్లో తమ అవసరం తగ్గిపోవడం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనాతో ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్చలు మొదలయ్యాయి. ఎలాన్ మస్క్ నాయకత్వంలోని డీవోజీఈ ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు అన్ని విభాగాల్లో ఉద్యోగాలకు కోత విధిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే రక్షణ మంత్రి పీట్ హెగ్ సేత్ ట్రిలియన్ డాలర్ రక్షణ బడ్జెట్‌లో ఎనిమిది శాతం తగ్గించే విషయమై చర్యలు తీసుకోవాలని తన విభాగం అధికారులను ఆదేశించారు.