పశ్చిమాసియా(మిడిల్ ఈస్ట్) లో ఇరాన్ తో అమెరికా శాంతి ఒప్పందంతో యుద్ద ఉద్రిక్తతలు చల్లారుతాయని భావించిన వారికి షాక్ ఇస్తూ…ఇజ్రాయెల్ తాజాగా లెబనాన్ పై సైనిక దాడులకు పాల్పడింది. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగిన మరుసటి రోజునే ఇజ్రాయెల్ చర్యతో మరోసారి పశ్చిమాసియాలో తిరిగి ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దక్షిణ లెబనాన్‌లోని నబతియే జిల్లా హెజ్‌బొల్లా స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు అర్ధరాత్రి భారీ ఎత్తున వైమానిక, రాకెట్ దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు మరికొందరు గల్లంతయ్యారు.
నబాతియే నగరంతో పాటు కఫర్ జౌజ్, కఫర్ రెమాన్, జెబ్డైన్ వంటి సమీప పట్టణాల్లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ఈ దాడులు నిర్వహించింది. కఫర్ టిబ్నిట్, రేహాన్ వంటి ఎత్తైన ప్రాంతాలలో కూడా వరుస వైమానిక దాడులు కొనసాగాయి. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ జరిపిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఇదొకటని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ తాజా దాడుల ఉద్రిక్తతల కారణంగానే జెనీవాలో శుక్రవారం జరగాల్సిన అమెరికా-ఇరాన్ తదుపరి శాంతి చర్చలు నిలిచిపోయినట్లు స్విస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. అమెరికా-ఇరాన్ ఒప్పందాన్ని విమర్శించిన ఇజ్రాయెల్ అధికారులపై జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఇరు మిత్రదేశాల (అమెరికా-ఇజ్రాయెల్) మధ్య విభేదాలు మరింత ముదిరాయి. తాజాగా పశ్చిమాసియాలో శాంతికి విఘాతం కల్గించే రీతిలో ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం అమెరికాకు మరింత ఆగ్రహాన్ని తెప్పించేదిగా కనిపిస్తుంది.
