US Student Visas Decline | అమెరికాకు తగ్గిపోయిన స్టూడెంట్ వీసాదారులు
అమెరికాలో విద్యాభ్యాసానికి వెళ్లే స్టూడెంట్‌వీసాదారుల సంఖ్య ఈ ఆగస్ట్‌లో గణనీయంగా తగ్గిపోయిందని బ్లూంబెర్గ్ పేర్కొన్నది. ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ విధానాలే దీనికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- భారత్ నుంచి 43.5 % శాతం క్షీణత
- నాలుగేళ్లలో ఇదే అత్యంత కనిష్ఠం
- ఇతర దేశాల నుంచీ అదే పరిస్థితి
US Student Visas Decline | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ వలస పాలసీల నేపథ్యంలో ఆ దేశానికి వెళ్లే స్టూడెంట్ వీసాదారుల సంఖ్య ఈ ఆగస్ట్‌లో గణనీయంగా తగ్గింది. గత నాలుగేళ్లతో పోల్చితే ఇది అత్యంత కనిష్ఠమని రికార్డులు చెబుతున్నాయి. ‘విద్యార్థి వీసాలపై అమెరికాకు వచ్చేవారి సంఖ్య ఆగస్ట్ నెలలో 19% తగ్గి, 3.13 లక్షలుగా ఉన్నది. గత ఐదు నెలలుగా ఇది తగ్గుతూ వస్తున్నది’ అని అమెరికాకు రాకపోకలను ట్రాక్ చేసే ఇంటర్నేషనల్ ట్రేడ్ అడ్మినిస్ట్రేషన్ డాటాను ప్రస్తావిస్తూ బ్లూంబెర్గ్ పేర్కొన్నది. 2021 కొవిడ్ పరిస్థితుల తర్వాత ఆగస్ట్ నెలలో వచ్చినవారి సంఖ్య అత్యల్పమని తెలిపింది. ఈ ఏడాది ఆగస్ట్ వరకూ విద్యార్థుల రాక సుమారు 12 శాతానికి తగ్గిపోయిందని తెలిపింది.
ప్రత్యేకించి ఆసియా దేశాల నుంచి ఈ తగ్గుదల గణనీయంగా ఉన్నది. సాధారణంగా అమెరికాకు స్టూడెంట్ వీసాలపై వెళ్లేవారిలో ఆసియా దేశాల నుంచే అత్యధికంగా ఉంటారు. అయితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ‘అమెరికా ఫస్ట్’ విధానం ప్రభావంగానే ఈ తగ్గుదల కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. బ్లూంబెర్గ్ కథనం ప్రకారం.. ఆసియా ఖండం నుంచి అమెరికాకు విద్యార్థుల రాక 24శాతం తగ్గి, 1,91,000గా ఉన్నదని తెలిపింది. క్షీణతలో భారత్ నుంచి 45 శాతం ఉంటే.. చైనా నుంచి 12 శాతం ఉన్నది. ఆసియాలోని జపాన్ మొదలుకుని వియత్నాం వరకూ మొత్తం 13 అతిపెద్ద మార్కెట్ సోర్స్ దేశాల నుంచి ఈ ఏడాది ఆగస్ట్‌లో విద్యార్థుల రాక గణనీయంగా తగ్గింది. ఆఫ్రికా నుంచి చాలా తక్కువ మంది అమెరికాలో చదువుకునేందుకు వెళుతున్నప్పటికీ వారిలో కూడా 33శాతం తగ్గుదల ఉన్నది. పశ్చిమ యూరప్ దేశాల నుంచి ఒకశాతం కంటే తక్కువ క్షీణత కనిపించింది.
ఎందుకీ క్షీణత?
ఈ వేసవిలో (మే చివరిలో) ట్రంప్ యంత్రాంగం విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపివేసింది. దానికితోడు సోషల్ మీడియా రివ్యూలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నది. ఇవి కూడా ప్రభావం చూపాయి. అయితే.. అమెరికా రావద్దన్నా.. అనేక ఇతర దేశాలు భారత విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించారు. ఇదేమీ భారతీయ విద్యార్థులకు ఎదురుదెబ్బ కాదని, వారికి వేరే దేశాలకు వెళ్లేందుకు అవకాశాలు, మార్గాలు ఉన్నాయని చెప్పారు. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, ఆఖరుకు ఐర్లాండ్ వంటి దేశాలు కూడా భారతీయ విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయని చెప్పారు.
దేశం | H1 2024 | H1 2025 | % మార్పు |
భారతదేశం | 25,990 | 14,697 | -43.5% |
చైనా | 14,709 | 11,167 | -24.1% |
వియత్నాం | 4,450 | 5,324 | +19.6% |
నేపాల్ | 4,593 | 3,808 | -17.1% |
దక్షిణ కొరియా | 3,525 | 2,878 | -18.4% |
జపాన్ | 2,567 | 2,222 | -13.4% |
ఫ్రాన్స్ | 2,185 | 2,170 | -0.7% |
బ్రెజిల్ | 2,339 | 2,133 | -8.8% |
మొత్తం
2024లో మొదటి వారం: 104,074
2025లో మొదటి వారం: 88,753
శాతం మార్పు: -14.7%