Trump Imposes $100,000 Fee On H-1B Visas | హెచ్ 1బీ వీసా కు లక్ష డాలర్లు : విదేశీయులకు ట్రంప్ షాక్
హెచ్1బీ వీసా ఫీజు ఏడాదికి లక్ష డాలర్లు, భారత్ సహా విదేశీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

విధాత : అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లుగా నిర్ణయిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఈ నిర్ణయంతో ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.అలాగే లాటరీ సిస్టమ్‌ను రద్దు చేశారు దీంతో కొత్త హెచ్1బీ వీసా విధానం భారత్‌తో పాటు, చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ప్రతి హెచ్-1బీ వీసాపై ఏటా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు యూఎస్ కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించినట్లు తెలిపారు. ‘‘మీరు ఎవరికైనా శిక్షణ ఇవ్వదలుచుకుంటే ఇటీవల మన దేశంలోని గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన మన వారికి ఇవ్వండి. అమెరికన్లకు ట్రైనింగ్ ఇవ్వండి. మన ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపండి’’ అని లుట్నిక్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారని తెలిపారు. ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు.
భారత్ పై పెను ప్రభావం
1990లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం హెచ్-1బీ వీసా తీసుకొచ్చారు. యూఎస్‌లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. హెచ్1బీ వీసా కింద ప్రత్యే రంగాల్లో తాత్కాలిక విదేశీ కార్మికులను తీసుకురావడానికి ప్రతి ఏటా 65 వేల వీసాలను కంపెనీలకు ఇస్తారు. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు ఉన్న కార్మికులకు మరో 20 వేల వీసాలు అందుబాటులో ఉంటాయి. హెచ్-1బీ వీసా దారుల్లో ఇండియా 71 శాతం వాటా కలిగి ఉండగా, చైనా 11.7 శాతం వాటా కలిగి ఉంది. వీటిని మూడు నుంచి ఆరేళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. దీంతో ఈ వీసాను ఉపయోగించుకొని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నతోద్యోగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. తాజాగా తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. వీసా రుసుం చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది. అదేవిధంగా అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉన్నది.
మరోవైపు గోల్డ్‌కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి 10 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు 100 బిలియన్ డాలర్లు సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్‌కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ తెలిపారు
వాళ్లు హెచ్ 1బీ వీసా దారులే
అధ్యక్షుడు ట్రంప్ సతీమణి మెలానియా కూడా హెచ్-1బీ వీసాపై అమెరికాకు వెళ్లినవారే కావడం గమనార్హం. మోడల్ అయిన ఆమె 1996 అక్టోబర్‌లో వర్క్ వీసాపై అమెరికా వెళ్లి, అనంతరం అక్కడే స్థిరపడ్డారు. ఇక ట్రంప్ మాజీ దోస్త్, టెస్లా సీఈవో, అపరకుబేరుడు ఎలాన్ మస్క్ కూడా హెచ్1బీ వీసా పొందినవారే. దక్షిణాఫ్రికాలో జన్మించిన ఆయన అమెరికాకు వెళ్లి అక్కడే ఉండిపోయారు.
హెచ్ 1బీ, హెచ్ 4బీ ఉద్యోగస్తుల పై ట్రంప్ పిడుగు
హెచ్ 1బీ వీసాల రుసుంను లక్ష డాలర్లకు పెంచి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ వెంటనే హెచ్ 1బీ, హెచ్ 4బీ ఉద్యోగస్తులకు మరో షాక్ ఇచ్చారు. హెచ్ 1బీ, హెచ్ 4బీ ఉద్యోగస్తులు అమెరికా దాటి ఉన్నవాళ్లు వెంటనే తిరిగి అమెరికా రావాలి అంటే వారి కంపెనీలు ఎస్100కే మొత్తాన్ని అమెరికా ప్రభుత్వానికి పన్ను కట్టాలి అనే కొత్త నిబంధన తెచ్చాడు. ఈ నిబంధన ఆదివారం ఉదయం 8:00 గంటల నుండి అమలు పరుచనున్నట్లు తెలిపారు.
దీంతో మెక్రోసాఫ్ట్, మెటా సహా పలు కంపెనీలు ఇప్పటికే అమెరికా దాటి వెళ్ళిన హెచ్ 1బీ,, హెచ్ 4బీ ఉద్యోగస్తులు వారి సెలవులు ముగించుకొని ఆదివారం ఉదయం 8:00 గంటలకల్లా అమెరికాలో ఉండాలి అని ఇప్పటికే సందేశాలు పంపాయి. ఎవరైనా వెకేషన్ ప్లాన్ లో భాగంగా అమెరికా బార్డర్ క్రాస్ చేసే ప్రయాణాలు ఉంటే తక్షణం రద్దు చేసుకోవాల్సిందిగా ఆయా కంపెనీలు స్పష్టం చేశాయి. ట్రంప్ నిర్ణయం పై స్పష్టత వచ్చేంత వరకు అమెరికాలో ఉండాలని మెటా సూచించింది. రెండు వారాలపాటు అమెరికాలో ఉద్యోగులు ఎక్కడికి వెళ్లొద్దని పేర్కొంది.
ఇప్పటికే ఇండియా ఇతర దేశాల్లో వెకేషన్ లో ఉన్న హెచ్1బీ, హెచ్ 4బీ ఉద్యోగస్తులు అమెరికా కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 8:00 గంటల లోపు అమెరికా లో ల్యాండ్ అయ్యేలా ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు దీంతో విమాన ఛార్జీలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.