American Dollar | డాలర్‌ ఆధిపత్యానికి ఇక చెల్లు చీటీ? భారీగా పతనమైన గ్రీన్‌బ్యాక్‌ విలువ

శుక్రవారం డాలర్‌ విలువ మరింత పతనమైంది. ఇన్వెస్టర్లు డాలర్‌ను కాదని, ప్రత్యామ్నాయ సేఫ్‌ హెవెన్‌లుగా భావించే స్విస్‌ ఫ్రాంక్‌ (Swiss franc), జపనీస్‌ యెన్‌ (Japanese yen), యూరో (euro)తోపాటు.. బంగారంవైపు భారీగా మళ్లారు. ఈ క్రమంలోనే బంగారం ఆల్‌ టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నది.

American Dollar | డాలర్‌ ఆధిపత్యానికి ఇక చెల్లు చీటీ? భారీగా పతనమైన గ్రీన్‌బ్యాక్‌ విలువ

American Dollar | దేశానికి పూర్వవైభవం తీసుకొస్తానంటూ ప్రతీకార టారిఫ్‌లతో ట్రంప్‌ (US President Donald Trump) ప్రారంభించిన వాణిజ్య యుద్ధం.. అమెరికాకే తిప్పికొడుతున్నది. ఇప్పటికే అమెరికా స్టాక్‌మార్కెట్‌లు  నెత్తురోడుతున్నాయి. పరిస్థితి తీవ్రత నేపథ్యంలో టారిఫ్‌ల అమలుపై తాత్కాలిక విరామం ప్రకటించినా.. అమెరికా డాలర్‌(American Dollar)పై శాశ్వత హానికరమైన ప్రభావం చూపే దిశగా పరిణామాలు సాగుతున్నాయి. దీనికి నిదర్శనమే ఇటీవలి కొద్ది రోజులుగా భారీగా పతనమవుతున్న డాలర్‌ విలువ. అమెరికా ఆర్థిక వ్యవస్థపై సడలిపోతున్న విశ్వాసమే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. డాలర్‌పై నమ్మకం లేక ( waning confidence ) గ్రీన్‌బ్యాక్‌ (అమెరికా డాలర్‌కు ముద్దుపేరు) ను వదిలి.. సురక్షితమైన కరెన్సీలు, ప్రత్యేకించి బంగారంవైపు పెద్ద సంఖ్యలో తరలిపోతున్నారు. ఫారెక్స్‌ మార్కెట్లలో తీవ్రమైన అస్థిరతలు, వొలాటిలిటీ ఇండెక్స్‌ (VIX)లో పెరుగుదల ఉంటే.. సాధారణంగా డాలర్‌ బలపడటానికి దారి తీస్తుంది. కానీ.. గత వారం రోజులుగా దీనికి విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

శుక్రవారం డాలర్‌ విలువ మరింత పతనమైంది. ఇన్వెస్టర్లు డాలర్‌ను కాదని, ప్రత్యామ్నాయ సేఫ్‌ హెవెన్‌లుగా భావించే స్విస్‌ ఫ్రాంక్‌ (Swiss franc), జపనీస్‌ యెన్‌ (Japanese yen), యూరో (euro)తోపాటు.. బంగారంవైపు భారీగా మళ్లారు. ఈ క్రమంలోనే బంగారం ఆల్‌ టైమ్‌ గరిష్ఠానికి చేరుకున్నది. మరోవైపు ఈ దశాబ్దపు గరిష్ఠాన్ని స్విస్‌ ఫ్రాంక్‌ నమోదు చేసిందని రాయిటర్స్‌ గణాంకాలను బట్టి తెలుస్తున్నది. దానికి తోడు టారిఫ్‌లపై తాత్కాలిక నిలుపుదలను ట్రంప్‌ ప్రకటించడంతో దొరికిన ఊరటను ఉపయోగించుకున్న ఇన్వెస్టర్లు.. వాల్‌స్ట్రీట్‌ స్టాక్స్‌ను రాత్రికి రాత్రే ముంచేశారు.

డాలర్‌ ఇండెక్స్‌ తీవ్రస్థాయి పతనం నేపథ్యంలో భారతదేశ రూపాయి `బలపడుతుందని ఊహించినా.. శుక్రవారం బలహీనంగానే ప్రారంభమైంది. చమురు ధరల్లో కూడా పతనం కొనసాగుతున్నది. డాలర్‌ పతనం.. తప్పనిసరిగా ప్రారంభంలో రూపాయికి మద్దతు పెంచుతుందని ఫారెక్స్‌ ట్రేడర్‌ ఒకరు వ్యాఖ్యానించారు. అయితే.. రూపాయి విలువ 86 దాటి వెళ్లే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యానికి (global finance) డాలర్‌ ప్రధాన మారకంగా ఉన్నది. అయితే.. గురువారం మూడు శాతం పతనమై.. 99.70 స్థాయికి దిగింది. గడిచిన 12 నెలల కాలంలో ఇదే గరిష్ఠ పతనం. 2023 జూలై తర్వాత వందశాతం కంటే తక్కువగా వెళ్లడం ఇదే ప్రథమం. ఈ పరిణామాలు గమనిస్తుంటే.. ప్రపంచ మారకంగా డాలర్‌ పాత్ర క్రమేపీ కనుమరుగైనా ఆశ్చర్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.