MI vs LSG|  ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియ‌న్స్ చాలా చెత్త ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చింది. చివ‌రి మ్యాచ్‌ని ఓట‌మితోనే ముగించింది. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడ‌గా, ఇందులో ఆ జ‌ట్టు గెలిచింది కేవ‌లం నాలుగు మాత్ర‌మే. ఈ క్ర‌మంలో నాకౌట్ అయిన తొలి జ‌ట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే గత రాత్రి ల‌క్నోతో జ‌రిగిన చివరి మ్యాచ్‌లో అయిన అద్భుతంగా రాణించి మంచి విజ‌యం సాధిస్తారు అనుకుంటే స‌మిష్టిగా విఫ‌ల‌మై 18 ప‌రుగుల తేడాతో చిత్తైంది ముంబై ఇండియ‌న్స్. ముందుగా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ బ్యాటింగ్ చేయగా, ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కి గాను 6 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగులు చేసింది.కేఎల్ రాహుల్(41 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 55), నికోలస్ పూరన్(29 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 75) అద్భుతంగా ఆడి జ‌ట్టుకి మంచి స్కోరు ద‌క్కేలా చేశారు.

చివ‌ర్లో ఆయుష్ బదోని(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 22 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఇక ముంబై బౌలర్లలో నువాన్ తుషారా(3/28), పియూష్ చావ్లా(3/29) మూడేసి వికెట్లు తీసుకున్నారు. ఇక లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 196 పరుగుల ద‌గ్గ‌రే ఆగిపోయింది. ఇంపాక్ట్ ప్లేయర్‌ రోహిత్ శర్మ(38 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 68), నమన్ ధిర్(28 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటిన‌ప్ప‌టికీ మిగ‌తా బ్యాట‌ర్స్ అంద‌రు విఫ‌లం కావ‌డంతో ముంబైకి మ‌రో ఓటమి త‌ప్ప‌లేదు. స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(0), హార్దిక్ పాండ్యా(16) దారుణ వైఫల్యం ముంబై ఇండియ‌న్స్ కొంప‌ముంచింది.

లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా, మోహ్‌సిన్ ఖాన్ ల‌కి ఒక్కో వికెట్ ద‌క్కింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌పున ఓపెన‌ర్‌గా డెవాల్డ్ బ్రెవిస్(23) బరిలోకి దిగాడు. ఉన్నంత సేపు దూకుడు ఇన్నింగ్స్ ఆడారు. మ‌రోవైపు రోహిత్ కూడా విజృంభించ‌డంతో ముంబై ఇండియన్స్ 3.5 ఓవర్లలో 33 పరుగులు చేసింది. ఆ స‌మ‌యంలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా దాదాపు 30 నిమిషాల పాటు ఆట ఆగిపోగా, తిరిగి మ‌ళ్లీ కొన‌సాగించారు. ఏదేమైన లక్నో త‌మ చివ‌రి మ్యాచ్‌లో మంచి విజ‌యాన్ని సాధించింది కాస్త ఊర‌ట చెందింది.