counting of backward classes । దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలి.. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి : అప్నాదళ్‌ (ఎస్‌) నేత అనుప్రియ

దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలనే డిమాండ్‌కు ఎన్డీయే భాగస్వామ్యపక్షాల్లోనే మద్దతు నానాటికీ పెరుగుతన్నది. ఇప్పటికే జేడీయూ ఈ డిమాండ్‌ను లేవనెత్తగా.. తాజాగా ఎన్డీయే భాగస్వామ్యపక్షం అప్నా దళ్‌ (ఎస్‌) అదే నినాదం అందుకున్నది.

counting of backward classes । దేశవ్యాప్తంగా బీసీ కుల గణన చేపట్టాలి.. ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలి : అప్నాదళ్‌ (ఎస్‌) నేత అనుప్రియ

counting of backward classes । దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలనే డిమాండ్‌కు ఎన్డీయే భాగస్వామ్యపక్షాల్లోనే మద్దతు నానాటికీ పెరుగుతన్నది. ఇప్పటికే జేడీయూ  ఈ డిమాండ్‌ను లేవనెత్తగా.. తాజాగా ఎన్డీయే భాగస్వామ్యపక్షం అప్నా దళ్‌ (ఎస్‌) అదే నినాదం అందుకున్నది.  సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేంద్ర సహాయ మంత్రి, అప్నాదళ్‌ (ఎస్‌) (Apna Dal (S)) నాయకురాలు అనుప్రియ పటేల్‌ (Anupriya Patel) రాబోయే జన గణనలో బీసీ జనాభా లెక్కలను (counting of backward classes) సేకరించాలని తమ పార్టీ కోరుతున్నదని తెలిపారు. బీసీలకు కేంద్రంలో ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కూడా ఆమె వాదించారు. ‘దేశంలో వెనుకబడిన తరగతులది (backward classes) భారీ జనాభా. 1990లలో మండల్‌ కమిషన్‌ సిఫారసులను (Mandal Commission recommendations) అమలు చేసినప్పుడు దేశవ్యాప్తంగా బీసీ జనాభా 52 శాతం ఉంటుందని అంచనా వేశారు. ‘అనేక సంవత్సరాల్లో దేశ జనాభా 140 కోట్లకు చేరుకున్నది. 2047లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే నాటికి దేశ జనాభా 167 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.  అప్పటికి బీసీ జనాభా కూడా గణనీయంగా పెరుగుతుంది’ అని అనుప్రియ పటేల్‌ చెప్పారు.  దేశంలో అతిపెద్ద జనాభాగా ఉన్న బీసీలు అనేక సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్నారని, వాటిపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ‘ఒకప్పుడు కేంద్రంలో మైనార్టీ సంక్షేమ శాఖ లేదు. గిరిజన సంక్షేమ శాఖ కూడా లేదు. కానీ.. తర్వాతి కాలంలో మైనార్టీలు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి వాటికి ప్రత్యేకంగా సంక్షేమ శాఖలు వచ్చాయి’ అని ఆమె తెలిపారు. ‘దేశంలో బీసీలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని అప్నాదళ్‌ నమ్ముతున్నది. కనుక.. జనాభా లెక్కల సేకరణ సమయంలో బీసీల జనాభాను కూడా లెక్కించాలి. దానితో బీసీల సంఖ్య విషయంలో అధికారిక లెక్కలు బయటకు వస్తాయి. బీసీలకు న్యాయం చేసేందుకు బీసీ మంత్రిత్వ శాఖను (Ministry of Backward Classes) ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది’ అని ఆమె చెప్పారు.

కోర్టు విచారణల్లో వరుస వాయిదాలు ఇచ్చే సంస్కృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన అనుప్రియ పటేల్‌.. ఈ సమస్య పరిష్కారానికి అఖిల భారత స్థాయిలో జ్యుడిషియల్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు (examination for judicial posts at the all-India level) నిర్వహించాలని అన్నారు. అప్పుడే దేశంలోని అన్ని ప్రాంతాల యువత దిగువ కోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకూ సేవ చేసే అవకాశం కలుగుతుందన్నారు. దానివలన న్యాయ వ్యవస్థలో సామాజిక సమతుల్యం తీసుకువచ్చినట్టు అవుతుందని చెప్పారు. అంతేకాకుండా దేశంలో జడ్జీల కొరత సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే..  యూపీలో (Uttar Pradesh Assembly by polls) త్వరలో జరిగే పది అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ‘గుర్తు ఏదైనా, ఎన్డీయే అభ్యర్థులు ఏ స్థానంలో పోటీ చేసినా మీ శక్తుయుక్తులన్నీ ఉపయోగించి, ఆ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి’ అని చెప్పారు.