Maoists| జనవరి 1న సాయుధ విరమణ: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్(MMC) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు లేఖ విడుదల చేశారు. జనవరి 1నఆయుధాలు విడిచి లొంగిపోతామని లేఖలో స్పష్టం చేశారు. ఒక్కొక్కరు కాకుండా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | Nov 28, 2025, 11:05 am IST
Read Time: 6 mins
Maoists| జనవరి 1న సాయుధ విరమణ: మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన

 

విధాత : జనవరి 1న సాయుధ విరమణ చేస్తామని మావోయిస్టు(Maoists) పార్టీ ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్(MMC) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఈ మేరకు లేఖ విడుదల చేశారు. జనవరి 1నఆయుధాలు విడిచి లొంగిపోతామని (Surrender)లేఖలో స్పష్టం చేశారు. ఒక్కొక్కరు కాకుండా అందరం ఒకేసారి లొంగిపోతామని తెలిపారు. ఆయుధాలు అప్పగించి ప్రభుత్వ పునరావాసాన్ని అంగీకరిస్తామని చెప్పారు. అయుధాలు వదులుకోవడం ప్రజలకు ద్రోహం చేయడం కాదని పేర్కొన్నారు. ఇది సంఘర్షణకు సరైన సమయం కాదు.. ఆయుధాలు ఒక ముగింపు, ఒక మార్గం కాదు.. కానీ సరైన మార్గాన్ని ఎంచుకోవడానికి తీసుకునే నిర్ణయమని కూడా స్పష్టం చేశారు.

తమకు సహకరించే రాష్ట్రంలో లొంగిపోవడానికి సిద్ధమని పేర్కొన్నారు. అందరూ లొంగిపోయే వరకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని కోరారు. మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పార్టీ బలహీనమైందని పేర్కొన్నారు. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో సాయుధ విరమణ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

ప్రభుత్వం చేపట్టిన ‘పూనా మార్గెం’ ప్రచారాన్ని అంగీకరిస్తున్నామని, శాంతి చర్చలకు అనుకూలంగా ముందుకు సాగడానికి సిద్ధమని తెలిపారు. పరస్పర సమన్వయం, కమ్యూనికేషన్‌ కోసం ఒక ఓపెన్‌ ఫ్రీక్వెన్సీ నంబర్‌‌ను కూడా విడుదల చేసినట్లుగా వెల్లడించారు. తమ సమస్యలను వినడానికి, పరిష్కరించడానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, చర్చల కోసం ముందుకు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించారు. ఈ ప్రకటననపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది.

 

ప్రకటనలో మరిన్ని అంశాలు:  లొంగిపోయే వరకు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు సంయమనం పాటించాలని, ఆ తేదీ వరకు భద్రతా కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని అనంత్ కోరారు.

ఛత్తీస్‌గఢ్‌లో సతీష్ దాదా, మహారాష్ట్రలో సోను దాదా విషయంలో జరిగినట్లుగా, మేము మా ఆయుధాలను ఈ మూడు రాష్ట్రాలలో ఒక ముఖ్యమంత్రికి లేదా హోంమంత్రికి అప్పగించి, ప్రధాన స్రవంతిలో చేరాలనుకుంటున్నాము. వచ్చే నెలలో ఈ మొత్తం ప్రక్రియను శాంతియుతంగా పూర్తి చేయడంలో మాకు ఉత్తమ మద్దతును అందించే రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆయుధాలను అప్పగించి, ప్రధాన స్రవంతిలో చేరడానికి మేము ఇష్టపడతామన్నారు.

మేము రేడియోలో శ్రీ విజయ్ శర్మ (ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర హోం మంత్రి) ప్రసంగం విన్నాము. ఆయన 10 నుండి 15 రోజులు సరిపోతుందని అన్నారు. అంత తక్కువ సమయం సరిపోదు. జనవరి 1, 2026 పట్ల ఆయనకు ఎటువంటి అభ్యంతరం ఉండకూడదని స్పష్టం చేశారు. మేము ఖచ్చితంగా కొన్ని నిర్దిష్ట ప్రతిపాదనలు, డిమాండ్లను ప్రభుత్వానికి అందించాలనుకుంటున్నామన్నారు.
ఈ ప్రక్రియ సుఖాంతం అయ్యే వరకు ఎటువంటి చర్యలో పాల్గొనవద్దని సహచరులను కూడా అభ్యర్థించారు. ఈసారి మనం PLGA వారోత్సవాన్ని జరుపుకోబోమని నేను పునరుద్ఘాటిస్తున్నాను. MMC సహచరులందరూ బహిరంగంగా సంప్రదించడానికి నేను బావోఫెంగ్ యొక్క ఓపెన్ ఫ్రీక్వెన్సీ (నంబర్) 435.715 ను జారీ చేస్తున్నాని అనంత్ పేర్కొన్నారు.