Bihar Elections | బీహార్‌లో డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పుల దాడి

బీహార్‌లో పోలింగ్‌ జరుగుతున్న క్రమంలో లఖీశరాయి జిల్లాకు ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్‌ సిన్హా వెళ్లారు. ఈ సమయంలో తన కాన్వాయ్ పై ఆర్‌జేడీ మద్దతు దారులు దాడి చేశారని డిప్యూటీ సీఎం ఆరోపించారు.

Bihar Elections | బీహార్‌లో డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై చెప్పుల దాడి

బీహార్ :

బీహార్‌లో పోలింగ్‌ జరుగుతున్న క్రమంలో లఖీశరాయి జిల్లాకు ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్‌ సిన్హా వెళ్లారు. ఈ సమయంలో తన కాన్వాయ్ పై ఆర్‌జేడీ మద్దతు దారులు దాడి చేశారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. లఖీశరాయి అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న సిన్హా, ఖోరియారి గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకుంది. ఆర్‌జేడీ కార్యకర్తలు తనను గ్రామంలోకి వెళ్లనివ్వకుండ అడ్డుకున్నారని, తన కాన్వాయ్ పై చెప్పులు, ఆవుపేడ విసిరారని విజయ్ కుమార్ ఆరోపించారు. ‘ఇవి ఆర్‌జేడీ గూండాల పనేని.. ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిసి ఇలాగే అల్లర్లు సృష్టిస్తున్నారు. నా పోలింగ్‌ ఏజెంట్‌ను బయటకు పంపేశారు. ఖోరియారిలోని 404, 405 పోలింగ్‌ బూత్‌ల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది’ అని సిన్హా తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

కాగా సిన్హా ఉదయం జగదంబ ఆలయానికి వెళ్లి పూజలు చేసిన అనంతరం తన నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే, ఇది స్థానిక గ్రామస్తుల ఆందోళన మాత్రమేనని పోలీసులు చెబుతున్నారు. పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై స్పందించిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ చట్టం.. శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీహార్ డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బీహార్‌ తొలి దశ పోలింగ్‌లో 243 స్థానాలు ఉండగా 121 సీట్లకు ఓటింగ్‌ జరుగుతోంది. రెండో దశ ఎన్నికలు నవంబర్ 11న జరగనుండగా.. 14 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ దశలో తేజశ్వి యాదవ్‌, తేజప్రతాప్‌ వంటి కీలక ఆర్‌జేడీ నేతలు, మంత్రుల భవిష్యత్తు తేలనుంది. రఘోపూర్‌, మహువా, తారాపూర్‌ వంటి హైస్టేక్స్‌ నియోజకవర్గాలపై రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ ఉంది.