Nitish Kumar| బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణా స్వీకారానికి ఏర్పాట్లు

బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి కసరత్తు చేస్తుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో నితీష్ కుమార్, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.

Nitish Kumar| బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణా స్వీకారానికి ఏర్పాట్లు

న్యూఢిల్లీ : బీహార్ సీఎం(Bihar Chief Minister)గా నితీష్ కుమార్(Nitish Kumar)మరోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్డీఏ కూటమి కసరత్తు చేస్తుంది. రేపు నితీష్ కుమార్ కేబినెట్ సమావేశం కానుంది. 17వ శాసన సభను రద్దు చేస్తూ కేబినెట్ తీర్మానం ఆమోదించనుంది. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా గవర్నర్‌కు సీఎం నితీష్ కుమార్ రాజీనామా సమర్పిస్తారు. ఆ తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు తమ నాయకుడిగా నితీష్ కుమార్ ను ఎన్నుకుని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు నివేదించనున్నాయి. గవర్నర్ ఆహ్వానం లభించగానే నితీష్ కుమార్ బీహార్ సీఎంగా 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనన్నారు. పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో నితీష్ కుమార్, ఆయన మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనున్నారని సమాచారం.

నితీష్ కేబినెట్ లో మెజార్టీ మంత్రి పదవులు బీజేపీకే

కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా నితీష్ కుమార్ కసరత్తు చేస్తున్నారు. నితీష్ పార్టీ జేడీయూ, మిత్ర పక్షాలు బీజేపీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్ పాశ్వాన్), హిందూస్థాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం), రాష్ట్రీయ లోక్ మోర్చా(ఆర్ఎల్ఎం) పార్టీలకు ఇవ్వాల్సిన మంత్రి పదవులపై ఆదివారం సుధీర్ఘ కసరత్తు కొనసాగిస్తున్నారు. కూటమి నేతలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మంత్రివర్గ కూర్పుపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో జేడీయూ 85, బీజేపీ 89, ఎల్జేపీ 19, హెచ్ఏఎం 5, ఆర్ఎల్ఎం 4 నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి మంత్రివర్గంలో మెజార్టీ మంత్రి పదవులు కేటాయించనున్నారు.