విధాత, హైదరాబాద్ : శాసన సభ కార్యకలాపాలకు అడ్డుపడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మైనింగ్‌పై హౌస్ కమిటీ వేయాలని బీఆర్ఎస్, సభ్యులు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం ముందు బైఠాయించి సభా కార్యకలపాలకు అడ్డుపడుతున్నందునా..వారిని రెండు రోజుల పాటు..ఈ బడ్జెట్ సెషన్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలని శాసన సభ వ్యవహరాల మంత్రి శ్రీధర్ బాబు సస్పెన్షన్ తీర్మానం పెట్టారు.
ఈ తీర్మానం మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ సభ్యులను రెండు రోజుల పాటు..అంటే ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు(ఆది, సోమవారాలు) సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. సభలో కీలకమైన బడ్జెట్ చర్చ జరగకుండా బీఆర్ఎస్ సభ్యులు అడ్డుతగలడం విచారకరం అని ఈ సందర్బంగా శ్రీధర్ బాబు విమర్శించారు.
సస్పెండ్ అయిన వారిలో హరీశ్‌రావు, కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, అనిల్ జాదవ్, కోవ లక్ష్మి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు, పద్మారావు, చింత ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునితాలక్ష్మారెడి, కల్వకుంట్ల సంజయ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కాలేరు వేంకటేశ్, విజయుడు, కేపీ వివేకానంద తదితరులు ఉన్నారు.
పాడి కౌశిక్ రెడ్డి వివాదంపై ఎథిక్స్ కమిటీ
శాసన సభలో మాజీ మంత్రి, సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీ ద్వారా విచారణ జరిపించి..చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ కు సూచించారు. కౌశిక్ రెడ్డి ఇదే రీతిలో వ్యవహరిస్తే బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని సూచించారు. ఈ మేరకు శాసన సభ వ్యవహరాల మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానం మేరకు పాడి కౌశిక్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి అప్పగిస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించారు. ఎథిక్స్ కమిటీ నివేదిక మేరకు కౌశిక్ రెడ్డిపై చర్యలు ఉంటాయని తెలిపారు.
