Kishan Reddy | దేశ భక్తులను తక్కువ చేసి చూసిన కాంగ్రెస్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సర్దార్ వల్లభాయ్ పటేల్, పీవీ నరసింహారావు, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి దేశభక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తక్కువ చేసి చూసింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.

Kishan Reddy | దేశ భక్తులను తక్కువ చేసి చూసిన కాంగ్రెస్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

విధాత, హైదరాబాద్ :

సర్దార్ వల్లభాయ్ పటేల్, పీవీ నరసింహారావు, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి దేశభక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తక్కువ చేసి చూసింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ఏడాది పొడవునా పటేల్ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించబోతున్నాయని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రం వరకు.. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు.. రైతు నుంచి స్వాతంత్ర్య సమరయోధుడి వరకు ప్రతి భారతీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగస్వామిగా ఉండబోతున్నాడన్నారు.

వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడు మాత్రమే కాదు.. గుజరాత్‌లో రైతు ఉద్యమ నాయకుడుగా కూడా ప్రజల మనసుల్లో నిలిచారని కొనియాడారు. కానీ కాంగ్రెస్ పార్టీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహనీయులు, లేదా తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు లాంటి నాయకులు నచ్చరు.. వారికి నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ గుర్తు ఉండరు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ‘దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాడిన వీరులందరినీ చరిత్రలో నిలిచేలా చేయడం.. నవతరానికి వారి త్యాగాలను తెలియజేయడం.. భారత ప్రభుత్వం చేపట్టిన గొప్ప కర్తవ్యం. వల్లభాయ్ పటేల్ ను ఏ తెలంగాణ బిడ్డ ఎప్పటికీ మరిచిపోడు. సర్దార్ చొరవతోనే ఈ తెలంగాణ గడ్డపై భారత త్రివర్ణ పతాకం ఎగిరింది. లేకపోతే నిజాం పాకిస్థాన్ జెండాను ఎగరవేయడానికి సిద్ధంగా ఉన్న నిజాం అహంకారాన్ని అణిచిన ఉక్కు మనిషి వల్లభాయ్ పటేల్’ అని కిషన్ రెడ్డి కొనియాడారు.

సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలంగాణలోని ప్రతి బిడ్డ ఆయన పేరును గౌరవంగా స్మరించుకుంటాడన్నారు. అందరం కలసి సర్దార్ వల్లభాయ్ పటేల్150వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఆయన ఇచ్చిన ఐక్యత, స్వాతంత్ర్య విలువలను గుర్తుచేసుకుందాం.. ప్రతి తెలంగాణ బిడ్డ ఆయన త్యాగాలను మరువకూడదు.. ఈ సంవత్సరం మొత్తం ఆయనను స్మరించుకుంటూ, రజాకార్ల దమనకాండను గుర్తుచేసుకుంటూ, సర్దార్ పోరాటాన్ని ఘనంగా స్మరించుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.