భగభగ మండుతున్న దండకారణ్యం.. శాంతి చర్చలకు సన్నాహాలు

భగభగ మండుతున్న దండకారణ్యం.. శాంతి చర్చలకు సన్నాహాలు
  • సాగుతున్న సాయుధ దళాల సమరం
  • మానవహణనం.. మారణహోమం
  • యుద్ధంలో సర్కారు, మావోయిస్టులు
  • నిత్యం రక్తమోడుతున్న పచ్చని అడవి
  • మంటలార్పేందుకు మరో ప్రయత్నం
  • శాంతిచర్చలకు తాజా సన్నాహాలు
  • పౌరస్పందన కమిటీ ప్రతిపాదన
  • ఇరువర్గాలపై ఒత్తిడికి తమ వంతు కృషి
  • ఆలోచనాపరులతో ప్రత్యేక కార్యాచరణ
  • హైదరాబాద్ కేంద్రంగా మార్చిలో సమావేశం
  • ప్రయత్నం ఫలిస్తుందా? లేదా అనే ఆసక్తి

(రవి సంగోజు) విధాత ప్రత్యేక ప్రతినిధి: దండకారణ్యం భగభగ మండుతోందీ. ఆకుపచ్చని అడవి నిత్యం రక్తమోడుతోందీ. సర్కారు, మావోయిస్టుల సాయుధ దళాల యుద్ధంలో నిత్యం ఎవరో ఒకరు సమిధలుగా మారుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, ఝార్కండ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించిన దండకారణ్యం తాజాగా నిత్యం పరస్పర తుపాకుల మోత, బాంబుల మోతతో పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో ముఖ్యంగా దుర్భేధ్యమైన అబూజ్ మడ్ అడవులను కేంద్రంగా చేసుకుని మావోయిస్టులు సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. సాయుధ పోరాటం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇది గిట్టని కేంద్రప్రభుత్వం ఈ మధ్య కాలంలో మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా దూకుడుతో ముందుకు సాగుతున్నారు. సాయుధ అణచివేతకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో వందలాది మంది మావోయిస్టు కేడర్, ప్రధాన నాయకత్వం కేంద్ర సాయుధ దళాల చేతిలో మృత్యువాతపడ్డారు. దీనికి ప్రతికారంగా మావోయిస్టులు ఇన్ఫార్మల పేరుతో కొందరిని, మందుపాతరలు పేల్చి సాయుధ బలగాలను మట్టుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇరువైపులా రక్తపాతం కొనసాగుతున్నది.

ఇరువర్గాల మధ్య శాంతికి సన్నాహాలు?

కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య సాగుతున్న ఈ యుద్ధానికి ఏదో ఒక దశలో అంతం పలికి ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య ‘చర్చల’కు ఒక ప్రాతిపదిక ఏర్పాటు చేయాలనే ప్రయత్నం తాజాగా మరోసారి ప్రారంభమైంది. ఈ మేరకు పౌర స్పందన కమిటీ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించాలనే సన్నాహం ప్రారంభమైంది. దీని కోసం సమాజం పట్ల సానుభూతితో, నిజాయితీగా పనిచేసే బుద్దిజీవులు, ఇతర వర్గాలను సమీకరించి ఈ చర్చను తీవ్రం చేయాలని యోచిస్తున్నారు. ప్రభుత్వం పై, మావోయిస్టులపై ఒత్తిడిని పెంచి ‘కాల్పుల విరమణ’ పాటించేందుకు ఒప్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా ఈ నెల మొదటి వారంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాలను సమీకరించి ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు ఒక నోట్ రూపొందించారు. మాజీ న్యాయమూర్తి జస్టస్ చంద్రకుమార్, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి ఆధ్వర్యంలో మరి కొంతమంది ఈ కార్యాచరణలో భాగస్వామ్యమయ్యారు. ఈ కమిటీ ప్రయత్నం పట్ల ఇప్పుడు ఆసక్తి నెలకొంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మావోయిస్టుల పట్ల కఠిన వైఖరితో ఉన్న ప్రస్తుత సందర్భంలో వేదిక కృషి ఏ మేరకు ఫలిస్తుందోననే చర్చసాగుతోంది. ఏమైనప్పటికీ ఈ ప్రయత్నానికి సానుకూల స్పందన కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.

ఆపరేషన్ ‘కగార్’ పేరుతో ‘యుద్ధం’

ఇటీవల ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మధ్య భారతంలోని ఈ దండకారణ్యం లక్ష్యంగా లక్షలాది మంది సాయుధ పోలీసులు, పారా మిలటరీ, మిలటరీ, సరిహద్దు భద్రతా దళాలు, ప్రత్యేక కమాండో బృందాలను రంగంలోకి దింపి అప్రతిహతమైన అణచివేతను కోనసాగిస్తుంది. మావోయిస్టులపై యుద్ధాన్ని ప్రకటించి వందలాది మందిని ఎన్ కౌంటర్లలో హతమారుస్తున్నారు. ప్రతిగా మావోయిస్టులు దాడులు చేస్తున్నారు. గెరిల్లా యుద్ధాన్ని మావోయిస్టులు కొనసాగిస్తున్నారు. ఇరువురి యుద్ధంలో నిత్యం ఎవరో ఒకరి రక్తతర్పణ సాగుతోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశవ్యాప్తంగా ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్టు రహిత ప్రాంతంగా మారుస్తామంటూ కేంద్ర మంత్రి అమిత్ షా బహిరంగంగానే ప్రకటన చేశారు. దీనికి తగిన విధంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ బలగాలను ఈ ప్రాంతంలో భారీగా మోహరించి అధునాతనసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వందలాది మందిని హతమారుస్తూ దండకారణ్యం పై ప్రభుత్వ బలగాలు పట్టును కొనసాగించే ప్రయత్నంలో ఉన్నారు.

దశాబ్దాలుగా సాగుతున్న పోరు

దశాబ్దాలుగా ఈ అటవీ ప్రాంతాలు కేంద్రంగా ఆదివాసీ ప్రజలకు అండగా పనిచేస్తున్నారు. ఈ నక్సలైట్లు లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో నక్సలైట్లు, ప్రభుత్వ సాయుధ దళాలకు మధ్య తరచూ ఎదురుకాల్పులు జరిగి ఇరువైపుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ అక్రమంలో వందలాది మంది నక్సలైట్లు, సర్కారు సాయుధ బలగాల్లో పనిచేసే వారు ప్రాణాలు కోల్పోతున్నారు.

ఆపదలో ఆదివాసీలు

ప్రభుత్వ సాయుధ బలగాలు, నక్సలైట్లు ఇద్దరి మధ్య సామాన్యలు, ఆదివాసీ ప్రజలు అసువులు బాస్తున్నారు. నక్సలైట్లపై అణచివేత క్రమంలో ప్రభుత్వ సాయుధ దళాలు నక్సలైట్ల పేరుతో, నక్సలైట్లకు సహకరిస్తున్నారనే పేరుతో ఆదివాసీలలో కొందరిని ఇన్ఫార్మరులుగా ముద్ర వేసి దారుణ హత్యలకు పాల్పడుతున్నారు. ఇరువైపులా రోజుకో ఎక్కడో ఒక మారుమూల అటవీ పల్లెల్లో ప్రాణాలు విడుస్తున్నారు. వారు ఎవరైనప్పటికీ ఈ దేశ ప్రజలపైన్నే యుద్ధం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇరువర్గాల యుద్ధంలో అమాయక ఆదివాసీలు సర్వం కోల్పోతున్నారు. దశాబ్దాలుగా ఆదివాసీల అభివృద్ది, ఈ దేశ విముక్తి, విప్లం కోసమే తాము పనిచేస్తున్నామని మావోయిస్టులు ప్రకటిస్తున్నారు. కార్పొరేట్లకు అటవీ ప్రాంతంలోని ఖనిజ సంపదను అప్పగించేందుకు ప్రభుత్వం అప్రతిహత నిర్బంధాన్ని, అణచివేతను కొనసాగిస్తుందని మావోయిస్టులు విమర్శిస్తున్నారు. అమాయ ఆదివాసీలను మావోయిస్టులు మభ్యపెడుతున్నారని, మావోయిస్టుల చెర నుంచి వారిని రక్షించేందుకే తాము ప్రయత్నిస్తున్నాం అంటూ కేంద్రం ప్రకటిస్తోంది. అభివృద్ధి, సంక్షేమం తమ విధానమని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆదివాసీల గూడాలను, అడవులను సాయుధ దళాల తుపాకుల మోతకు నెలవులుగా ఇరువర్గాలు మార్చేశారనే విమర్శలున్నాయి.

పౌర స్పందన కమిటీ నోట్

ప్రధానంగా గత ఏడాది జనవరి నుంచి దండకారణ్యం యుద్ధ రంగంగా మారిపోయింది. దండకారణ్య ప్రాంతం అంటే చత్తీస్ ఘడ్, మహారాష్ట్ర ,తెలంగాణ, ఆంధ్రా, ఒడిస్సా బార్డర్ లతో కూడిన దాదాపు 92 వల 300 చదరపు కిలోమిటర్ల పరిధిలోని ఆటవీ ప్రాంతం. ఇక్కడ 50 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో 2 నుంచి మూడు కోట్ల మంది నివసిస్తున్నారు. ఇక్కడ మావోయిస్టు ఉద్యమం కేంద్రీకరించి ఉంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన మేరకు 2026 మార్చి నాటికి మావోయిస్టులను రూపుమాపడమే లక్ష్యంగా ప్రభుత్వం యుద్ధం చేస్తోంది. లక్షకు పైగా సాయుధ బలగాలతో బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేసి, నూతన టెక్నాలజీతో రక్తపు టేర్లు పారిస్తున్న ట్లు వార్తలు వస్తున్నాయి. గ్రామస్థులను పట్టుకొని కాల్చిచంపడం, మావోయిస్టులకు అన్నం పెట్టారని, సమాచారం ఇస్తున్నారని తీసుకపోయి చంపడం, జైళ్లలో నిర్భందించడం వంటి ఘటనలు సాగుతున్నాయి. వేలాది మంది ఆదివాసీలు గూడాలను విడిచి పారిపోతున్నారు. మారణ హోమంలో చనిపోతున్న వారిలో మావోయుస్టులతో పాటు, సాధారణ ఆదివాసీలు ఉంటున్నారని వార్తలు, మావోయిస్టుల ప్రతి దాడుల్లో పోలీసులు, జవానులు చనిపోతుండగా ఇన్ ఫార్మర్ల పేరిట సాధారణ ప్రజలను చంపుతున్నారు.

పరిస్థితి ఆందోళనకరం

దండకారణ్యంలో సాగుతున్న యుద్ధం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నది. భారత రిపబ్లిక్ తన బిడ్డలను తనే చంపుకోవడం సరైనది కాదని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకోని ఇరువైపుల జరుగుతున్న మారణ హోమం, ప్రాణ నష్టాన్ని ఆపేందుకు పత్రికా, న్యాయ, మేధావి, సామాజిక, లౌకిక, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున్న గొంతు విప్పాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పక్షం వైపు కాకుండా నిజాయితీగా దేశంలోని వివిధ వర్గాల ప్రజలను ఈ మారణ హోమాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ పాటించి, ఆదివాసీలు భద్రతమైన జీవితం గడిపేందుకు ఇరు పక్షాలు కట్టుబడి ఉండాలని విజ్ఞప్తి చేస్తుంది. యుద్ధాన్ని ఆపి రాజకీయ చర్చలు చేయాలని భారత ప్రభుత్వం, మావోయిస్టు పార్టీకి కొన్ని ప్రతిపాదనలతో పిలుపు నిద్దాం. కార్యాచరణ కోసం చర్చించి మారణ హోమాన్ని ఆపడానికి నిర్ణయం చేయాలని కోరారు. మార్చి మొదటి వారంలో హైదరాబాద్ లో జరిగే ప్రిపరేటివ్ మీటింగు తేదీ, సమయం, స్థలం తెలియజేస్తాం. ఆదివాసీ, ప్రజాస్వామిక, లౌకిక, దళిత, మత, మైనారిటీ, హక్కుల సంఘాల, సామాజిక కార్యకర్తలందరినీ ఆహ్వానిస్తున్నట్లు నోట్ లో పేర్కొన్నారు.

– జస్టిస్ చంద్రకుమార్, కె.రామచంద్రమూర్తి. పౌర స్పందన యూనిటీ