CJI BR Gavai | నేను అన్ని మతాలను గౌరవిస్తాను: సీజేఐ బి.ఆర్. గవాయ్

సుప్రీం కోర్టులో సీజేఐ బి.ఆర్. గవాయ్ వైపు ఒక వృద్ధు న్యాయవాది చెప్పు విసిరాడు. "సనాతనధర్మ అవమానాన్ని భారత్ భరించదు" అంటూ నినాదాలు చేసిన వ్యక్తి అదుపులోకి. సీజేఐ స్పందన: “ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవు.”

CJI BR Gavai | నేను అన్ని మతాలను గౌరవిస్తాను: సీజేఐ బి.ఆర్. గవాయ్
  • ఖజురాహో జవారి ఆలయ విష్ణు విగ్రహ పునరుద్ధరణ పిటిషన్ తిరస్కరణ
  • ‘నీ దేవుడినే అడుగు’ వ్యాఖ్యతో చీఫ్జస్టిస్​ సంచలనం

CJI BR Gavai clarifies on his ‘ask your deity’ remark amid Khajuraho Vishnu idol controversy

న్యూఢిల్లీ:
మధ్యప్రదేశ్‌లోని ఖజురాహో యునెస్కో వారసత్వ సంపదలో భాగమైన జవారి ఆలయంలో ఉన్న పురాతన విష్ణు విగ్రహం తల భాగం దెబ్బతిన్న నేపథ్యంలో పిటిషనర్ రాకేష్ దలాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆలయ సంప్రదాయాన్ని నిలబెట్టే ఉద్దేశ్యంతో కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు, అలాగే ప్రాచీన శిల్పానికి పునరుద్ధరణ అనుమతులు ఇవ్వాలనే దిశగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.

అయితే, సీజేఐ బి.ఆర్. గవాయ్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం — దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా తిరస్కరించింది. విచారణలో సీజేఐ గవాయ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

వెళ్లి మీ దేవుడినే స్వయంగా అడగండి

“If you are a strong devotee of Lord Vishnu, then pray and do some meditation. Go and ask the deity himself to do something.”
(“మీరు విష్ణువుకు మహా భక్తుడని చెబుతున్నారు కాబట్టి,  ప్రార్థించండి, తపస్సు చేయండి, వెళ్లి మీ దేవుడినే అడగండి ఏదైనా చేయమని”)

ఈ వ్యాఖ్యలోని “మీ దేవుడినే అడగండి” అనే వ్యాఖ్య సహజంగానే సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. చాలామంది నెటిజన్లు దీన్ని “మతపరమైన అసహనంగా అభివర్ణించగా, మరికొందరు న్యాయపరంగా కోర్టు వ్యాఖ్యలు తాత్కాలిక ఆగ్రహంలో రావొచ్చని అన్నారు.

ఇది పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిధిలోకి వచ్చే అంశం అని కోర్టు స్పష్టం చేసింది. “ఇది పురావస్తు శాఖ ఆస్తి. ఆ విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు ASI అనుమతిస్తుందా లేదా అనేది వారి నిర్ణయం. కోర్టు దీనిలో జోక్యం చేసుకోలేదు,” అని బెంచ్ పేర్కొంది. అదే సమయంలో గవాయ్ జస్టిస్ పిటిషనర్‌కి మరో ఆసక్తికర వ్యాఖ్య చేశారు, “మీరు శైవం పట్ల వ్యతిరేకత లేనివారైతే, అక్కడే ఉన్న మహా శివలింగాన్ని దర్శించండి. అది ఖజురాహోలో ఉన్న అతిపెద్ద లింగం.”

నేను అన్ని మతాలను గౌరవిస్తాను

ఇవన్నీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్​ కావడంతో, సీజేఐ గవాయ్ స్వయంగా ఈ వివాదంపై స్పందించారు. గురువారం జరిగిన మరో విచారణ సందర్భంగా సీజేఐ గవాయ్, ఈ అంశంపై స్వయంగా వ్యాఖ్యానిస్తూ, నేను చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వేరే విధంగా చూపిస్తున్నారని ఎవరో నాకు చెప్పారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను,” అన్నారు.

ఆయన వ్యాఖ్యలకు మద్దతుగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, “గవాయ్ గారు నాకు 10 ఏళ్లుగా తెలుసు. ఆయన దేవాలయాలు, మసీదులు, చర్చిలు అన్నీ సందర్శించారు. ఆయన మత వివక్షతో మాట్లాడే వ్యక్తి కాదు. అయితే ఇప్పుడు ‘న్యూటన్ సూత్రం మారిపోయింది — ప్రతి చర్యకు సమాన ప్రతిచర్య కాకుండా సోషల్ మీడియాలో అసమానమైన ప్రతిచర్య వస్తోంది,” అన్నారు.

సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ కూడా అదే బెంచ్ ముందు మాట్లాడుతూ, “మేము కూడా ప్రతి రోజూ ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాం. సోషల్ మీడియా ఇప్పుడు అదుపు తప్పిన గుర్రంలా మారింది. ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకోవడంలో ముందుంటోంది. అన్నారు.

సీజేఐ గవాయ్ కూడా నెపాల్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, “అక్కడ కూడా ఇలాగే ఒక సంఘటన జరిగింది. చిన్న వ్యాఖ్య పెద్ద వివాదంగా మారింది,” అన్నారు.