Former DSP Nalini| షాకింగ్… మాజీ డీఎస్పీ నళిని మరణ వాగ్మూలం!
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన నళిని తెలుగు ప్రజలకు సుపరిచితమే. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య ఉన్నట్లుగా తెలియచేస్తూ మరణ వాంగ్మూలం పేరిట బహిరంగ లేఖను విడుదల చేయడం కూడా అంతే సంచలనంగా మారింది.

విధాత : తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి సంచలనం సృష్టించిన నళిని(Former DSP Nalini) తెలుగు ప్రజలకు సుపరిచితమే. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య ఉన్నట్లుగా తెలియచేస్తూ మరణ వాంగ్మూలం(death letter) పేరిట బహిరంగ లేఖ(Public Letter)ను విడుదల చేయడం కూడా అంతే సంచలనంగా మారింది. గత డిసెంబర్ 30న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నళిని తనకు మళ్లీ ఉద్యోగం అక్కరలేదని..వీలైతే తను స్థాపించిన వేద యజ్ఞ పరిరక్షణ సమితికి ఆర్థిక సహాయం చేయాలని కోరింది. ఇన్నాళ్లకు మరణ వాంగ్ములం పేరిట బహిరంగ లేఖ విడుదల చేయడం..అదికాస్తా వైరల్ గా మారడం జరిగింది. నళిని రాసిన లేఖ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ.. (వీలునామా/మరణ వాంగ్మూలం)
ఒక అధికారిణి గా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవిక గా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను.3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను.
8 ఏండ్ల క్రితం సోకిన రుమటాయిడ్ ఆర్థరైటిస్(Ruematoid arthritis) అనే విలక్షణ కీళ్ల జబ్బు(Blood cancer+ Bone Cancer) గత రెండు నెలలుగా టైపాయిడ్ , డెంగ్యూ,చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణకణం పేలిపోతున్నట్లు , ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి.. తట్టుకోలేక పోతున్నాను. 2018 లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడ్డపుడు,మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగుచేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు.
25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్
25ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మసిస్టు ను కూడా. కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ,ధ్యానం, వేదాధ్యయనం,యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది.దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి.
నా జీవితం నిలువెల్లా గాయాల మయం
నా గతమంతా వ్యధ భరితం.. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే..డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసి తీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే ,12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని, అందులో విశేషమైన కృషి చేస్తూ , యజ్ఞ బ్రహ్మగా VYPS ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)సంస్థాపకురాలుగా ఎదిగి, హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని, నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది.
సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన దరఖాస్తు బుట్టదాఖలు
ఇలాంటి తరుణంలో నేటి సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నా ఫైల్ ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్క కట్టి( సుమారు 2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. (రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం..నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది). 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు.
సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి
మీడియా మిత్రులకు విజ్ఞప్తి…నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్,కవయిత్రి యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే..నాకు సరైన, ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. లేదంటే..ఇంకా 3,4 పుస్తకాలు రచించాలని,100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని, ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు.
నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం vyps( వేద యజ్ఞ పరిరక్షణ సమితి)కు చెందుతుంది. బ్రతుకుండగా దేశ ప్రధానిని కలవలేక పోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాను. నా మనోభావాలను పంచుకొనే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్ బుక్ కు ధన్యవాదాలు.
సెలవిక మిత్రులారా..అంటూ నళిని లేఖను ముగించింది.