గణేశ్ మండపాలకు ఉచిత విద్యుత్
వినాయకచవితి పర్వదినం సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసుకునే గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

- పోలీసుల అనుమతి ఉంటేనే
- సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
వినాయకచవితి పర్వదినం సందర్భంగా భక్తులు ఏర్పాటు చేసుకునే గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు. గణేశ్ నవరాత్రి ఉత్సవాలపై గురువారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు నిర్వహకులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల(Navratri celebrations) నిర్వహణ ప్రభుత్వానికి,నిర్వాహకులకు మధ్య సమన్వయంతో జరగాలన్నారు. అందరి సలహాలు,సూచనలు స్వీకరించేందుకే ఈ సమావేశం నిర్వహించామన్నారు. నగరంలో ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా పోలీసుల అనుమతి తీసుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్న రేవంత్, దరఖాస్తులను పరిశీలించి మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించారు. ఏరియాల వారీగా నిమజ్జనానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రతి ఏరియాలో కోఆర్డినేషన్ కమిటీలను నియమించుకోవాలని చెప్పారు. వీవీఐపీ సెక్యూరీపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు చాలా కీలకమైనదన్న రేవంత్ రెడ్డి రాజకీయ, రాజకీయేతర కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు నిర్వాహకుల సహకారం అవసరమన్నారు.