కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలోనే హైదరాబాద్‌ ఎక్కువగా అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

విధాత, హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. 2004 నుంచి 2014 మధ్య కాలంలోనే హైదరాబాద్‌ ఎక్కువగా అభివృద్ధి చెందిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే నగర అభివృద్ధి సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఓఆర్‌ఆర్‌, శంషాబాద్‌ విమానాశ్రయం, మెట్రోరైలు ఇవన్నీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే తీసుకువచ్చింది. 2014 నుంచి హైదరాబాద్‌లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కేంద్రంలోని బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణకు చేసింది శూన్యం’’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 16వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉండగా.. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో రూ. 8 లక్షల 11 వేల కోట్ల అప్పు అయిందని గుర్తు చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్ ఐటీఆర్ కారిడార్ ఇస్తే.. దానిని రద్దు చేసింది మోదీ, కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు. మోదీ, కేసీఆర్, కిషన్ రెడ్డి, కేటీఆర్ లు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. వరదలతో హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం నుంచి కిషన్ రెడ్డి చిల్లిగవ్వ కూడా తీసుకురాలేదని విమర్శించారు. సచివాలయంలో గుడిని కూలగొడుతున్నా.. కిషన్ రెడ్డి ఎందుకు ప్రశ్నించలేదన్నారు.

ప్రగతి భవన్, కాళేశ్వరం, సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఈ నాలుగు మాత్రమే కేసీఆర్ ప్రారంభించి పూర్తిచేసినవేనని అన్నారు. కాళేశ్వరం కట్టడం.. కూలడం మూడేళ్లలో జరిగిపోయిందన్నారు. లక్షకోట్ల రూపాయలు గోదావరి పాలయిపోయాయన్నారు. ప్రగతి భవన్ కేసీఆర్ విలాసవంతాలకు మాత్రమే ఉపయోగపడిందన్నారు. కేటీఆర్ ను సీఎం చేయడానికే వాస్తు బాగా లేదని కేసీఆర్ నూతన సచివాలయాన్ని నిర్మించాడని సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆరోపణలు చేశారు. ఇతర వ్యక్తి గత జీవితాల్లోకి తొంగి చూడడానికి కమాండ్ కంట్రోల్ రూంతో పాటు ఫోన్ ట్యాపింగ్ చేశారని సీఎం ఆరోపించారు.