Moosi river flood| తగ్గిన మూసీ వరద ఉదృతి..వేగంగా ఎంజీబీఎస్ పునరుద్దరణ పనులు

మూసీ వరద ఉదృతి తగ్గడంతో..వరదతో చెరువుగా మారన ఎంజీ బస్ స్టేషన్ లో వరద నీరు ఖాళీ కావడంతో అక్కడ బురదను తొలగించి బస్సులు, ప్రయాణికుల రాకపోకలను పునరుద్ధరించే పనులను వేగవంతం చేస్తున్నారు.

Moosi river flood| తగ్గిన మూసీ వరద ఉదృతి..వేగంగా ఎంజీబీఎస్ పునరుద్దరణ పనులు

విధాత, హైదరాబాద్ : మూసీ నది(Moosi river flood)  శాంతించింది. వరద ఉదృతి తగ్గడంతో ఎంజీబీఎస్, చాదర్ ఘట్, ముసారాంబాగ్, పురానాపూల్, మలక్ పేట్, అంబర్ పేట్, ఉప్పల్ వరకు వరద ఉదృతి తగ్గడంతో సహాయక చర్యలను అధికార యంత్రాంగం ముమ్మరం చేసింది. ముఖ్యంగా మూసీ వరద నీటితో చెరువుగా మారన ఎంజీ బస్ స్టేషన్ లో(MGBS bus station restoration) వరద నీరు ఖాళీ కావడంతో అక్కడ బురదను తొలగించి బస్సులు, ప్రయాణికుల రాకపోకలను పునరుద్ధరించే పనులను వేగవంతం చేస్తున్నారు. అసలే ఆర్టీసీకి దసరా పండుగ సెలవుల సీజన్ ఆదాయం వచ్చే సీజన్ కావడంతో బస్సుల రాకపోకలను మధ్యాహ్నం నుంచి పునరుద్దరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌, ఉప్పల్‌, జేబీఎస్‌ నుంచి జిల్లాలకు బస్సులు నడుస్తున్నాయి. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు పికప్‌ పాయింట్ల వద్దకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. అటు జలదిగ్భంధానికి గురైన పురానాపూల్ శివాలయం శుభ్రం చేస్తున్నారు.

జంట జలాశయాల నుంచి తగ్గిన అవుట్‌ ఫ్లో

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ నుంచి నీటి విడుదల తగ్గడంతో మూసీకి వరద ఉదృతి కూడా తగ్గిపోయింది. శుక్రవారం రాత్రి అత్యధికంగా జంట జలాశయాల నుంచి 36 వేల క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేయడంతో వరద పోటెత్తి జనావాసాలను, రోడ్లను ముంచెత్తింది. ప్రస్తుతం ఇన్ ఫ్లో తగ్గడంతో జంట జలాశయాల నుంచి 4,847 క్యూసెక్కుల నీటిని మూసీలోకి అధికారులు విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి విడుదలవుతున్న అవుట్ ఫ్లో తగ్గడంతో మూసీ పరివాహక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇళ్లలోకి బురద చేరడంతో శుభ్రం చేసుకుంటున్నారు. ఉస్మాన్ సాగర్‌కు 1100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఇక్కడి నుంచి 884 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్‌కు 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇక్కడి నుంచి 3,963 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.