Kavitha: కవిత కొత్త కార్యాలయం ప్రారంభం..పార్టీ ఏర్పాటుకేనా!

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన సంస్థ తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నూతన కార్యాలయాన్ని కవిత ఈ రోజు ప్రత్యేక పూజల మధ్య ప్రారంభించనున్నారు. తెలంగాణ జాగృతికి కవిత కొత్త కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఆమె కొత్త పార్టీ పెడుతారన్న ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. ఇందిరా పార్కు వద్ద ఉన్న ప్రస్తుత కార్యాలయాన్ని మూసివేసిన కవిత బంజారాహీల్స్ లోని తన నివాసం సమీపంతో కొత్త కార్యాలయం తెరిచారు. సాయంత్రం 4గంటలకు కొత్త కార్యాలయం ప్రారంభించాక.. ఆమె మీడియాతో మాట్లాడబోతుండటం ఆసక్తికరంగా మారింది.
కొత్త పార్టీ పెడుతారా..?
కవిత ఇటీవల తన తండ్రి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు పార్టీలోని పరిణామాలను ప్రశ్నిస్తూ లేఖాస్త్రం సంధించారు. ఈ లేఖ బహిర్గతం కావడంతో ఆగ్రహం చెందిన కవిత పరోక్షంగా కేసీఆర్ చుట్టు దెయ్యాలున్నాయంటూ కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులపై ఘాటు విమర్శలు గుప్పించారు. ఓ వైపు మీడియా చిట్ చాట్ లలో పరోక్షంగా కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూనే..ఇంకోవైపు జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర చేస్తున్నారని..దీనిని వ్యతిరేకించినందుకే నన్ను దూరం పెడుతున్నారంటూ ఆరోపించారు.
పార్టీ కార్యక్రమాల నిర్వాహణ సరిగా లేదంటూ కేటీఆర్ పై విమర్శలు చేశారు. తనకు ఒకే నాయకుడు కేసీఆర్ అని..మరెవరి నాయకత్వాన్ని అంగీకరించబోనంటూ తేల్చి చెప్పారు. కొత్తగా తెలంగాణ జాగృతికి కమిటీలను ప్రకటించడం, సింగరేణి జాగృతి ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వెలుతారా కొత్త పార్టీ పెడుతారా అన్న ప్రచారం నేపథ్యంలో కవిత కొత్తగా తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించడంతో ఆమె కొత్త పార్టీ ప్రకటనకు సిద్దమవుతున్నారన్న ప్రచారం ఊపందుకుంటుంది. కవిత సొంత కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని సొంత కార్యక్రమాలతో ప్రజల్లో వెలుతుండటం బీఆర్ఎస్ శ్రేణులను కలవరపెడుతుంది.కాగా కవిత ఈనెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా చేయబోతున్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులను నిరసిస్తూ ఆమె ధర్నా చేయనున్నారు.