విధాత, హైదరాబాద్ : నిన్ను పొలిమేరకు దాటనివ్వనని..ఈ నెల 15న తర్వాత నీ సంగతి తేలుస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనను ఆపేవారు తెలంగాణ గడ్డపై ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. నేను దేనికైనా సిద్దం అని, ప్రజా ఉద్యమాలతో ఈ స్థాయికి వచ్చానని, రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదన్నారు. తెలంగాణకు ఎవరేం చేశారన్నదానిపై.. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెడదామో చెప్పాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రేవంత్ మాదిరిగా పది పార్టీలు మారలేదు..
తాను రేవంత్‌రెడ్డిలాగా పది పార్టీలు మారలేదని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తన పుట్టుక, చావు రెండు బీజేపీలోనే ఉంటాయని తెలిపారు. తానెంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని చెప్పుకొచ్చారు. రేవంత్‌రెడ్డి ఎంత రెచ్చగొట్టిన తాను తొందరపడనని అన్నారు. అన్నింటికి సమయమే సమాధానం చెబుతోందని పేర్కొన్నారు. తెలంగాణకు నేను చేసిన సేవలకు రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలుటీలు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు వాస్తవాన్ని గుర్తించారు. తెలంగాణ ప్రజలు ఆ పార్టీలకు గట్టి సమాధానం చెప్పారు. భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజాభిమానం, ప్రజల విశ్వాసమే ఆ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించింది. రేవంత్ రెడ్డి సర్టిఫికేట్ కాదు అని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల తీర్పే మాకు అసలైన సర్టిఫికేట్ అన్నారు. కేంద్రంలో మంత్రిగా తెలంగాణ కోసం నేను తీసుకొచ్చిన ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు బాగా తెలుసని చెప్పుకొచ్చరు.
ముందుగా ఎన్నికల హామీలను అమలు చేసి చూపించాలి
నాపై విమర్శలు చేసే ముందు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేయాలని, ఆ తర్వాత నా గురించి మాట్లాడితే బాగుంటుందని కిషన్ రెడ్డి హితవు పలికారు. దళితులు, బీసీలు రేవంత్‌రెడ్డి ఇంటికి వచ్చి ధర్నాలు చేస్తారని కిషన్‌రెడ్డి హెచ్చరించారు. కిషన్ రెడ్డి ప్రెస్ మీట తర్వతా జరిగిన ఉప్పల్ భగాయత్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ నెల 15వ తేదీ తర్వాత కార్యాచరణ ఉంటుందని మరోసారి పునరుద్ఘాటించారు.
