Kishan Reddy| ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మాకు బీఆర్ఎస్ మద్దతు అవసరమే లేదు : కిషన్ రెడ్డి

విధాత, హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మాకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు అవసరమే లేదని..అసలు కేటీఆర్(KTR) ను సపోర్ట్ చేయమని ఎవడు అడిగాడు? అని..అవసరానికి తగ్గట్టు మాట్లాడటం బీఆర్ఎస్ పార్టీకి బాగా అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి( Kishan Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులకు 2లక్షల టన్నులు ఎవరిస్తే వారికే మా మద్దతు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యూరియా(Yuria) అంతర్జాతీయ మార్కెట్ అనుగుణంగా కేంద్రం దిగుమతులు చేసుకుంటు రాష్ట్రాలకు సరఫరా చేస్తుందన్నారు. యూరియా కొరత సమస్య పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఉక్రెయిన్, చైనా సహా పలు దేశాల నుంచి యూరియా దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఇప్పటికే కేంద్రం యూరియాపై 70వేల కోట్ల సబ్సిడీగా భరించిందని..అన్ని దేశాల్లో యూరియా ధరలు పెంచినప్పటికి..భారత్ లో మోదీ ప్రభుత్వం మాత్రం పెంచలేదన్నారు. ఇప్పటికే తెలంగాణకు 20లక్షల మెట్రిక్ టన్నులు సరాఫరా చేశామని..మరో 2లక్షల టన్నుల సరాఫరా చేస్తామన్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు అభ్యర్థికి తెలంగాణ ఎంపీలు మద్దతునివ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పిన మాటలు అవకాశవాదంగా ఉన్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో తెలుగువారైన వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతిగా, స్పీకర్ గా బాలయోగిలు పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ సపోర్టు చేయలేదన్న సంగతి మరువరాదన్నారు.
పదవీచ్యుతి బిల్లులపై కాంగ్రెస్ రాద్దాంతం దురదృష్టకరం
130 వ రాజ్యాంగ సవరణ ద్వారా.. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా.. తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొని.. అరెస్టు అయి 30 రోజుల పాటు జైల్లో ఉన్నట్లయితే.. పదవినుంచి తొలగిపోవాలనే ఆలోచనతో కేంద్రం తెచ్చిన బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడాన్ని గుమ్మడి కాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాజ్యాంగ బద్ధంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు అరెస్టయితే.. తీవ్రమైన నేరారోపణలో జైలుకెళితే.. వారిపై కనీస చర్యలుండకూడదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ బిల్లుపై లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, వారి అభిప్రాయాలు దురదృష్టకరం అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకోసం తీసుకొచ్చిన చట్టం కాదు. అన్ని పార్టీలకు ఇది అమలవుతుందనే విషయం వారికి అర్థం కావడం లేదా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నైతిక విలువలను కాపాడేందుకు ఇలాంటి రాజ్యాంగ సంస్కరణ తీసుకొచ్చిందన్నారు. ఇది రాజ్యాంగానికి మరింత గౌరవం తెస్తుందని..దీనికి స్వాగతించి, మద్దతుగా నిలవాల్సిన విపక్షాలు.. విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గం అని విమర్శించారు.
2005లో సోరాబుద్ధీన్ ఎన్ కౌంటర్ కేసులో.. నాటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షా పేరు సీబీఐ చార్జిషీటులో ఉంటే..వారు మంత్రిగా రాజీనామా చేసి.. 2014లో వారి ప్రమేయం లేదని న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాతే పార్టీ బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. ఆ తర్వాతనే ఆయన లోక్ సభకు పోటీ చేశారన్నారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రమంత్రులు ఎవరైనా.. చట్టాలు చేసే వ్యక్తులకు న్యాయం వర్తించాలనేది బీజేపీ ఆలోచన అన్నారు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని.. పార్లమెంటులో, బయట ఉపన్యాసాలు ఇవ్వడం కాదని..రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించడం కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలన్నారు. ఎవరిపైనైనా నేరారోపణలపై న్యాయస్థానం విచారణ చేస్తుందని..దీనికి ప్రభుత్వానికి సంబంధం ఏముంటుందని..బిల్లుపై అపోహాలు అనవసరమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.