Medaram Maha Jatara 2025| మేడారం మహ జాతరకు రూ. 150 కోట్లు మంజూరు

ఉత్తర్వులు జారీ చేసిన గిరిజన సంక్షేమ శాఖ
జాతరను మరింత గొప్పగా నిర్వహిస్తామన్న మంత్రి సీతక్క
హైదరాబాద్, ఆగస్టు 20(విధాత):
మేడారం సమ్మక్క-సారలమ్మ( Medaram Maha Jatara 2025) మహా జాతర నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గిరిజనుల ఆధ్యాత్మిక కుంభమేళా( Tribal Festivals) గా పిలిచే ఈ మహోత్సవం విజయవంతంగా సాగేందుకు రూ.150 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించబోయే మేడారం మహా జాతర ఎన్నడూ లేని రీతిలో వైభవోపేతంగా జరగనుందని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా మంజూరు చేసిన నిధుల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్క,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ “ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆదివాసీల గౌరవానికి ప్రతీక. మేడారం మహా జాతర కోసం రూ. 150 కోట్లు మంజూరు చేయడం, ఆదివాసీ గిరిజనుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ప్రజా ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగనుంది” అని పేర్కొన్నారు.