Monsoon: బ్రేక్ తీసుకున్న రుతు పవనాలు!

Monsoon: బ్రేక్ తీసుకున్న రుతు పవనాలు!

Monsoon: దేశంలోకి ఈ ఏడాది వారం రోజుల ముందుగానే ఎంట్రీ ఇచ్చి కేరళను తాకి మురిపించిన రుతు పవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే విషయమై ముందుకు కదలమంటూ మొరాయిస్తున్నాయి. మారిన వాతావరణ పరిస్థితుల్లో నైరుతి ఋతుపవనాల కదలిక మందగించింది. దీంతో ఏపీ, తెలంగాణలో మళ్ళీ ఎండల తీవ్రత మొదలైంది. నాలుగు రోజులుగా వరుణుడి జాడ కనిపించడం లేదు. రుతుపవన ఆధారిత వర్షాలు పడటం లేదు. సాధారణంగా ఏటా జూన్ 4న ప్రవేశించాల్సిన రుతుపవనాలు 15ఏళ్ల తర్వాతా ఈ ఏడాది మే 26న ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల రైతుల్లో ఆనందం మొదలైంది. అయితేవాతావరణ మార్పులతో నైరుతి రుతు పవనాలు మందగించి మళ్లీ ఎండలు ముదరడంతో వ్యవసాయానికి ప్రతికూలంగా మారింది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నప్పటికి అవి రుతుపవన వర్షాలు కాకపోవడం గమనార్హం. రుతు పవనాల మందగమనంతో పగటి ఉష్ణోగ్రతలు మళ్లీ 36నుంచి 40డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో పగటి పూట ఉక్కపోత, రాత్రి చల్లనిగాలుు, ఉరుములు, మెరుపుల వర్షాలు కురిస్తున్నాయి.

అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తేమ తగ్గిపోయి పొడిగాలులు వీస్తూ రుతుపవనాలు మందగించాయని..అయితే జూన్ 11తేదీ కల్లా వాటిలో కదలిక వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల గమనంలో ఇలాంటి మందగమనం సహజమేనని..ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే రుతుపవనాలు పుంజుకుని వర్షాలు జోరందుకుంటాయని ..ఈ ఏడాది సాధరణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అంటే రుతుపవనాలు ముందుకు కదిలి తెలుగురాష్ట్రాల్లో తొలకరి జల్లులు కురువాలంటే అల్పపీడనం కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం విశేషం.