US Local Elections| న్యూయార్క్ మేయర్ డెమోక్రటిక్ ల కైవసం..ట్రంప్ కు బిగ్ షాక్

అమెరికాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ పదవి సహా పలు రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలలో డెమోక్రాట్లు విజయం సాధించారు. న్యూయర్క్ మేయర్ గా డెమోక్రటిక్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జొహ్రాన్‌ మమ్‌దానీ విజయం సాధించడం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ ఇచ్చింది.

US Local Elections| న్యూయార్క్ మేయర్ డెమోక్రటిక్ ల కైవసం..ట్రంప్ కు బిగ్ షాక్

న్యూఢిల్లీ : అమెరికాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో(US Local Elections 2025) అధికార రిపబ్లికన్ పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ పదవి సహా పలు రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలలో డెమోక్రాట్లు విజయం సాధించారు. న్యూయర్క్ మేయర్(New York Mayor Election)గా డెమోక్రటిక్ అభ్యర్థి, భారత సంతతికి చెందిన జొహ్రాన్‌ మమ్‌దానీZohraan Mamdani విజయం సాధించడం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు బిగ్ షాక్ ఇచ్చింది. మమ్‌దానీ గెలిస్తే న్యూయార్క్ నగరం నాశనమవుతుందని.. ఆర్థిక, సామాజిక విధ్వంసానికి గురవుతుందని, నగర మనుగడకే ముప్పు వాటిల్లుతుందని ట్రంప్ పోలింగ్ కు ముందు హెచ్చరించారు. అంతేకాదు కమ్యూనిస్టు భావజాలం కలిగిన మమ్‌దానీ న్యూయార్క్‌ మేయర్‌గా గెలిస్తే నేను కనీస అవసరాలకు సరిపడినంత స్థాయిలోనే నిధులు కేటాయిస్తాను అని ట్రంప్‌ సోషల్‌ మీడియా పోస్టులో ఓటర్లను బెదిరించే ప్రయత్నం చేశారు. అయినా న్యూయర్క్ ఓటర్లు మాత్రం ట్రంప్ మాటలను పట్టించుకోకుండా జొహ్రాన్‌ మమ్‌దానీకి ఘన విజయం కట్టబెట్టారు. ఈ పరిణామం సహజంగానే ట్రంప్ జీర్ణించుకోలేనిదిగా మారింది.

మేయర్ ఎన్నికల్లో ఉచిత సిటీ బస్సు ప్రయాణం, నగరంలో ఇంటి అద్దెలు అదుపు చేస్తామని, ధనవంతులు, కార్పోరేట్లపై పన్నులు విధించి, ఉద్యోగస్తులపై పన్నుల భారం తగ్గిస్తామన్న కీలక హామీలు మమ్ దానీ గెలుపులో కీలకంగా పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. న్యూయార్క్ నగర మేయర్ పదవిని అధిష్టంచబోతున్న తొలి ముస్లిం, భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా, అతి పిన్న వయస్కుడిగా కూడా మమ్ దానీ రికార్డు సొంతం చేసుకున్నాడు.

నెహ్రూ వ్యాఖ్యలు..

న్యూయార్క్‌ మేయర్‌గా తన విజయం.. ఒక రాజకీయ వంశాన్ని కూలదోసిందని జోహ్రాన్‌ మమ్దానీ చెప్పారు. విజయానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పాత నుంచి కొత్తలోకి అడుగు పెడుతున్నాం’ అన్న భారత ప్రధమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ వ్యాఖ్యలను ఉటంకించారు. రాజకీయ దిగ్గజం, న్యూయార్క్‌ రాష్ట్ర మాజీ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో, రిపబ్లికన్‌ నామినీ క్టిస్‌ స్లివాపై ఘన విజయం సాధించారు. ‘మిత్రులారా.. మనం ఒక రాజకీయ వంశాన్ని కూలదోశాం. ఆండ్రూ క్యూమో ఇక ప్రశాంతంగా విశ్రాంత జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఈ ఒక్క రాత్రి ఆయన పేరును నేను పలుకుతున్నాను. అనేక మందిని వదిలేసి.. కొద్ది మందికి మాత్రమే సమాధానాలు చెప్పే రాజకీయాలు ఇక ముగిశాయి. మనం ఆ పేజీని తిప్పేస్తున్నాం. ఈ రాత్రి మీరు దానిని సాధించారు’ అని జోహ్రాన్‌ మంగళవారం రాత్రి విజయోత్సవ సభలో చెప్పారు. అసాధ్యాలను సుసాధ్యాలు చేయవచ్చని న్యూయార్క్‌ ప్రజలు నమ్మినందునే మనం గెలిచాం.’ అన్నారు. ‘మీ ముందు నిలబడి.. జవహర్‌ లాల్‌ నెహ్రూ మాటలను గుర్తు చేసుకుంటున్నాను. ‘చరిత్రలో ఒక సందర్భంగా చాలా అరుదుగా వస్తుంది. అది మనం పాతదనం నుంచి కొత్తదనంలోకి వేసే అడుగు. ఒక యుగం ముగిసినప్పుడు, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన జాతి తన ఆత్మగౌరవాన్ని వ్యక్తపరిచినప్పుడు.. ఈ రాత్రి మనం పాతదాని నుంచి కొత్తదానికి అడుగు పెట్టాం’ అని అన్నారు.

వర్జీనియా గవర్నర్ ఎన్నికల్లోనూ రిపబ్లికన్ల ఓటమి

అమెరికాలోని వర్జీనియా గవర్నర్ పదవి ఎన్నికల్లోనూ రిపబ్లికన్లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వర్జీనియాలో పోటీ చేసిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమోక్రటిక్ అభ్యర్థి అబిగైల్ స్పాన్ బర్గర్ 3.20లక్షల ఓట్ల తేడాతో భారీ మెజార్టీతో గెలుపొందారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ గా అబిగైల్ రికార్డు సృష్టించారు.

నా పేరు లేకపోవడంతోనే ఓటమి : ట్రంప్

అమెరికా స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్‌ పార్టీ ఓటమిపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైన స్టైల్ లో స్పందించారు. బ్యాలెట్‌లో తన పేరు లేకపోవడం వల్లే పార్టీ అభ్యర్థులు ఓడిపోయారంటూ పోస్టు చేశారు. బ్యాలెట్‌లో ట్రంప్‌ పేరు లేదు. మరోవైపు నెల రోజులకు పైగా కొనసాగుతోన్న ఫెడరల్‌ షట్‌డౌన్‌. ఈ రెండు కారణాల వల్ల రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది అని పోల్‌స్టర్స్‌ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్‌ తన ట్రూత్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.