Delimitation Petition| తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం(Andhra Pradesh Reorganisation Act)మేరకు ఏపీ(AP), తెలంగాణ(Telangana)లో నియోజకవర్గాల పునర్విభజన(Delimitation) చేయాలని ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి(Purushotham Reddy) దాఖలు చేసిన పిటిషన్(Petition)ను సుప్రీంకోర్టు(Supreme Court) డిస్మిస్(Dismisses) చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరుపాలని పిటీషనర్ తరపు న్యాయవాదులు తమ వాదన వినిపించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేకంగా పునర్విభజన ప్రక్రియ చేపట్టిన సంగతిని గుర్తు చేస్తూ.. ఏపీ పునర్విజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నియోజకవర్గాల పునర్విభజన జరపాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో 175నుంచి 225కు, తెలంగాణలో 119నుంచి 153కు అసెంబ్లీ సీట్లు పెరిగి అభివృద్ధికి మరింత అవకాశం ఏర్పడేదని వాదించారు. కేంద్రాన్ని వెంటనే రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని అనుసరించి నియోజవర్గాల పునర్విభజన చేపట్టాలని ఆదేశించాలని కోరారు.
అయితే ఈ కేసులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్…ప్రభుత్వ న్యాయవాదుల వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం 2026 తరువాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగానే నిర్వహిస్తామని..ఇందుకు కసరత్తు జరుగుతుందని కోర్టుకు కేంద్రం వివరించింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 కూడా ఆర్టికల్ 170 కి లోబడే ఉంటుందని స్పష్టం చేసింది. ఒక రాష్ట్రం కోసం నియోజకవర్గాల పునర్విభజనకు అనుమతిస్తే మిగిలిన అన్ని రాష్ట్రాలు అదే రకంగా డిమాండ్ చేసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది. జమ్మూ కాశ్మీర్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించే నిబంధనలు.. ఇతర రాష్ట్రాల్లో నియోజకవర్గం పునర్విభజనకు భిన్నమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 2026 జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని స్పష్టం చేస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.