breaking news । మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌.. సీబీఐపై సంచలన వ్యాఖ్యలు

ఎట్టకేలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చింది.

breaking news । మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌.. సీబీఐపై సంచలన వ్యాఖ్యలు

breaking news । ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు బెయిల్‌ లభించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఢిల్లీలో ప్రస్తుతం రద్దు చేసిన ఎక్సయిజ్‌ పాలసీ కేసులో ఆయనను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తదుపరి సీబీఐ సైతం ఆయనను ఇదే కేసులో తీహార్‌ జైలులో అరెస్టు చేసింది. అయితే తన అరెస్టు చట్ట వ్యతిరేకమని  కేజ్రీవాల్‌ వాదిస్తున్నారు. ఈ కేసులో సెప్టెంబర్‌ 5న కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం  తీర్పును రిజర్వ్‌ చేసింది. శుక్రవారం తీర్పును జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం వెలువరించింది. దీంతో సుమారు ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టును కేజ్రీవాల్‌ ఆశ్రయించలేదంటూ సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో కేజ్రీవాల్‌ నేరుగా ఢిల్లీ హైకోర్టును అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బెయిల్‌ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.  కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో బెయిల్‌ను నిష్ఫలం చేసేందుకే సీబీఐ అరెస్టు ఉద్దేశించినట్టు ఉన్నదని జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ అరెస్టు సక్రమమేనని, అయినా ఆయన బెయిల్‌కు అర్హులని జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొనగా, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అరెస్టు అర్హతపై విభేదించారు. కేజ్రీవాల్‌ అరెస్టు సమాధానాలకంటే ప్రశ్నలనే ఎక్కువ రేకెత్తించిందని జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ స్పష్టం చేశారు. ‘అరెస్టు ఆవశ్యకత, అవసరం విషయంలో కేజ్రీవాల్‌ అరెస్టు ద్వారా సీబీఐ ఇచ్చిన సమాధానాలకంటే రేకెత్తించిన ప్రశ్నలే ఎక్కువ. మార్చి 2023లోనే ఆయనను ఇంటరాగేట్‌ చేసిన సీబీఐ ఆయనను అరెస్టు చేయడం అవసరం అని భావించలేదు. ఎన్‌ఫోర్సుమెంటు అరెస్టుపై స్టే వచ్చిన తర్వాతనే సీబీఐ చురుకుగా ముందుకు వచ్చి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అంటే సీబీఐ 22 మాసాలపాటు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాలనుకోలేదు. అరెస్టు చేసిన సమయం సీబీఐపై తీవ్రమైన సందేహాలను లేవనెత్తింది. కేజ్రీవాల్‌ బెయిల్‌ను అడ్డుకోవడంకోసమే సీబీఐ ఆయనను అరెస్టు చేసిందన్న భావన కలిగింది’ అని జస్టిస్‌ భూయాన్‌ స్పష్టం చేశారు. 22 మాసాలపాటు అరెస్టు చేయని సీబీఐ ఆగమేఘాలపై అరెస్టు చేయడంలోని అర్థంకాని విషయమని ఆయన అన్నారు. ‘సీబీఐ సందేహాతీతంగా వ్యవహరించాల్సింది. అక్రమంగా అరెస్టు చేశారన్న భావన కలుగకుండా చూడాల్సిన బాధ్యత సీబీఐపై ఉంది. మన దేశంలో మనం కలిగించే భావనలు ముఖ్యం. సీబీఐ ఒక పంజరంలో చిలుక అని వ్యక్తమవుతున్న భావనలను తొలగించుకోవడం ఆ సంస్థకు బాధ్యత. సీజరు భార్యలా సందేహాతీతంగా వ్యవహరించాలి’ అని జస్టిస్‌ భూయాన్‌ పేర్కొన్నారు.

పది లక్షల  రూపాయల పూచీకత్తుపై ఆయనను విడుదల చేయనున్నారు. ఈ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానించరాదని సుప్రీంకోర్టు షరతు విధించింది. ముఖ్యమంత్రి తన కార్యాలయానికి వెళ్లరాదని, ఫైళ్లపై  సంతకాలు చేయరాదన్న షరతులు కొనసాగుతాయి.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను మార్చి 21న అరెస్టు చేశారు. ఆయన తీహార్‌ జైలులో ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ఇదే కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేసింది.

ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, బీఆరెస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.