Supreme Court Wakf Amendment Bill| వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
వక్ఫ్(సవరణ) చట్టం-2025 కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు వెలువరించింది. వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు..చట్టంలోని కీలక ప్రోవిజన్స్ ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది.

న్యూఢిల్లీ: వక్ఫ్(సవరణ) చట్టం-2025 (Wakf Amendment Bill 2025) కేసులో సుప్రీంకోర్టు(Supreme Court) మధ్యంతర తీర్పు(Interim order) వెలువరించింది. వక్ఫ్ చట్టంపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు..చట్టంలోని కీలక ప్రోవిజన్స్ ను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రధానంగా కనీసం ఐదేళ్లపాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది.
అదే సమయంలో వక్ఫ్(సవరణ)చట్టం-2025పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది. వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని కోర్టు పేర్కొంది. బోర్డ్ లేదా కౌన్సిల్‌లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది. ఇక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది.
ఐదేళ్ల పాటు ఇస్లాంలో ఉండాల్సిన నిబంధనతో పాటు చట్టంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై కూడా స్టే ఇచ్చింది. వక్ఫ్ ఆస్తులా? కాదా అన్నది కోర్టులే నిర్ణయిస్తాయని తెలిపింది. వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లిములనే నియమించాలి.. వివాదాస్పద ఆస్తులపై థర్డ్ పార్టీ జోక్యం ఉండకూడదని సీజేఐ బీఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టం చేసింది.
వాదోపవాదాల క్రమం..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని 72కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ముస్లింల ఆస్తులను క్రమంగా లాగేసుకొనేందుకే వక్ఫ్ సవరన చట్టం తెచ్చారని..చట్టం అమలు నిలిపివేయాలని కోరుతు తమ వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ బీఆర్.గవావ్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం పబ్లిక్, ప్రైవేటు ఆస్తులు ఆక్రమణలకు గురికాకుండా రక్షించడానికి వక్ఫ్ చట్టసవరణ చేశామని వాదించింది. వక్ఫ్ అనేది మతపరమైన అవసరం కాదు, ఇది చారిటబుల్ కాన్సెప్ట్ అని కేంద్రం వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం చట్టానికి రాజ్యాంగబద్ధత ఉందని కేంద్రం చెప్పిందని.. పూర్తి స్టే ఇవ్వడం అనవసరం అని అభిప్రాయపడుతూ కీలక అంశాలపై మాత్రం స్టే విధించింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిన సుప్రీం ధర్మాసనం వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధతపై పూర్తి విచారణ కొనసాగించనుంది.
మధ్యంతర తీర్పులో కీలక అంశాలు
వక్ఫ్ ఆస్తులా ? కావా ? అన్నది కోర్టులే నిర్ణయిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం మధ్యంతర తీర్పులో వెల్లడించింది. ప్రభుత్వ ఆస్తులను వక్ఫ్ ఆక్రమించిందా? లేదా? అనే అంశంపై నిర్ణయించే అధికారం అధికారులకు కట్టబెట్టిన సెక్షన్ పై స్టే విధించింది. ఐదేళ్లు ఇస్లాం మతం ఆచరిస్తేనే వక్ఫ్ చేయాలన్న సెక్షన్ పైనే స్టే విధిస్తూ..ఈ అంశంపై ప్రభుత్వం తగిన నిబంధనలు రూపొందించే వరకు స్టే కొనసాగుతుందని తెలిపింది.
వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్ పై తాత్కాలికంగా ప్రభుత్వ చర్యలకు పరిమితి విధించింది. ఇప్పటికే వక్ఫ్‌గా గుర్తించబడిన ఆస్తుల స్థితిని తక్షణంగా మార్చకూడదని సూచించింది. అలాగే వక్ఫ్ బోర్డుల సభ్యత్వంలో ముస్లిమేతరుల నియామకంపై అభ్యంతరాలు ఉన్నా.. కోర్టు తాత్కాలిక స్టే ఇవ్వలేదు. కానీ ఈ అంశంపై వివరణాత్మక విచారణ అవసరమని పేర్కొంది. సెంట్రల్ వక్ఫ్ బోర్డులో నలుగురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దని తెలిపింది. స్టేట్ వక్ఫ్ బోర్డులో ముగ్గురికి మించి ముస్లిమేతరులను నియమించవద్దని స్పష్టం చేసింది. కలెక్టర్ విచారణ ద్వారా ప్రభుత్వ భూమిగా గుర్తింపు నిబంధనపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఆ అధికారం కలెక్టర్లకు లేదని.. ట్రిబ్యూనల్స్‌కే ఉందని స్టే విధించింది. ఇది ఆస్తుల హక్కులపై ప్రభావం చూపే అంశంగా పేర్కొంది.
సెక్షన్ 3ఆర్ – ఇస్లాం ఆచరిస్తూ 5 సంవత్సరాలు కావాలన్న నిబంధనపై నియమాలు రూపొందించకపోతే, అది యాదృచ్ఛిక అధికార వినియోగానికి దారి తీస్తుందని అభిప్రాయపడింది. సెక్షన్ 23మేరకు ఎక్స్ ఆఫీషియో అధికారి ముస్లిం సమాజానికి చెందినవారే కావాలని సూచించింది. సెక్షన్ 2సీ నిబంధన, సెక్షన్ 3సీ- రెవిన్యూ రికార్డుల్లో సవాలు చేస్తూ కలెక్టర్‌కు హక్కులు నిర్ణయించే అధికారం ఇవ్వడం.. అధికార విభజనకు విరుద్ధం అని పేర్కొంది. తుది తీర్పు వచ్చే వరకు ఆస్తుల హక్కులు ప్రభావితం కాబోవని.. హక్కు నిర్ణయించకముందు, వక్ఫ్ కూడా ఆస్తి నుండి తొలగించబడదని సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల్లో తెలిపింది.