Free Biryani | పశ్చిమాసియాలో ఉద్రికత్తల నేపథ్యంలో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ కొరత ఏర్పడి.. హోటళ్లు మూసివేసే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తమిళనాడులోని ఓ హోటల్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. తమకు ఎవరైనా ఒక్క గ్యాస్ సిలిండర్ ఇచ్చి.. నెల రోజుల పాటు చికెన్ బిర్యానీ లేదా.. మటన్ బిర్యానీ ఫ్రీగా తినొచ్చని బంపరాఫర్ ఇచ్చింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
తమిళనాడులోని హోసూర్‌కు చెందిన ఈరోడ్ అమ్మాయి మెస్ ఈ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. “మీరు మాకు వంట చేయడంలో సాయం చేయండి.. మేం మీకు భోజనం పెడతాం.” అనే సందేశంతో సోషల్‌మీడియాలో పోస్టు పెట్టింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ తీసుకొచ్చేవారికి ఒక నెల పాటు ఉచిత బిర్యానీ అందిస్తామని ప్రకటించింది. ఒక సిలిండర్ అందించిన వారు రోజుకు ఒకసారి చికెన్ బిర్యానీ (190) లేదా మటన్ బిర్యానీ (300) ఉచితంగా తినవచ్చని తెలిపింది. అదే రెండు సిలిండర్లు ఇస్తే నెల పాటు ప్రతిరోజూ రెండు ప్లేట్ల బిర్యానీ ఉచితంగా తినవచ్చని తెలిపారు. సిలిండర్ తీసుకొచ్చిన వారికి అదే కంపెనీకి చెందిన ఖాళీ సిలిండర్‌ను వెంటనే ఇస్తామని బోర్డు కూడా పెట్టింది. ఈ ప్రకటన ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ప్రకటనకు అనూహ్య స్పందన కూడా లభించింది. గత 15 రోజుల్లోనే ఆరుగురు వ్యక్తులు గ్యాస్ సిలిండర్లు తీసుకొచ్చి హోటల్‌కు అందించారు. అయితే ఆశ్చర్యకరంగా వారిలో చాలామంది రెండు రోజుల తర్వాత ఉచిత బిర్యానీని తిరస్కరించారట. వారు కేవలం బిర్యానీ మీద ఆశతో సిలిండర్లు ఇచ్చేందుకు రాలేదని.. మనిషికి మనిషి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ముందుకొచ్చారని రెస్టారెంట్ మేనేజర్ ఎస్.అశోక్ తెలిపారు. ఇది వారి మంచితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. నిజానికి ఈ ఆలోచన ఇచ్చింది కూడా తమ పాత కస్టమర్లే అని చెప్పారు. గ్యాస్ కొరత కారణంగా హోటల్ మూసివేయాలని నిర్ణయించుకున్నప్పుడు.. తమ పాత కస్టమర్లు ఈ ఐడియా ఇచ్చారని అన్నారు. హోటల్ మూసివేయొద్దని.. మేం సాయం చేస్తామని వారు ముందుగా హామీ ఇచ్చారని తెలిపారు. ఈరోడ్ అమ్మాయి మెస్ విషయానికి వస్తే ఇది సీరగ సంబా బిర్యానీతో హోసూర్‌లో చాలా ఫేమస్ అయ్యింది.
