Uttam Kumar Reddy | రాష్ట్ర వ్యాప్తంగా 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని, 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని సాగునీటి పారుద‌ల‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి వెల్ల‌డించారు.

Uttam Kumar Reddy | రాష్ట్ర వ్యాప్తంగా 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Telangana Announces 1516 Procurement Centers for Paddy Grains
  • రాష్ట్ర వ్యాప్తంగా 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు
  • 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోళ్ల‌కు ఏర్పాటు
  • ఈసీజన్‌లో 148.03 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి
  • రూ. 23 వేల కోట్ల‌తో ధాన్యం కొనుగోళ్లు
  • ధాన్యం దిగుబడిలో తెలంగాణ‌ అరుదైన రికార్డ్
  • స్వతంత్ర భారతదేశంలో అత్యధిక ఉత్పత్తి సాధించింది మన రాష్ట్రమే: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్‌11(విధాత‌): రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామ‌ని, 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని సాగునీటి పారుద‌ల‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి వెల్ల‌డించారు. శ‌నివారం ధాన్యం కొనుగోళ్ల‌పై యాదాద్రి-భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌రేట్‌లో స‌మీక్ష నిర్వ‌హించిన సంద‌ర్భంగా మాట్లాడుతూ ఈ వానాకాలం సీజ‌న్‌లో 66.80 లక్షల ఎకరాలలో రైతులు వ‌రి పంట వేశార‌న్నారు. ఈ సీజ‌న్‌లో అత్య‌ధికంగా 148.03 లక్షల మెట్రిక్ ట‌న్నుల దిగుబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ‌ అరుదైన రికార్డ్ సాధిస్తుంద‌న్నారు. స్వతంత్ర భారతదేశంలో అత్యధిక ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంద‌ని తెలిపారు. భారతదేశ చరిత్రలోనే ఈ దిగుబడి సంచలనం సృష్టిస్తుంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సాగు అయిన మూడు పంట‌ల‌లోనూ రికార్డ్ స్థాయిలో ఈ వానాకాలంలో ధాన్యం దిగుబ‌డి ఉంటుంద‌ని వెల్ల‌డించారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ల సార‌ధ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం సాధించిన ఘ‌న‌త‌గా ఉత్త‌మ్ అభివ‌ర్ణించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ అనుకూల విధానాలతోటే రికార్డ్ స్థాయిలో ఉత్పత్తి సాధ్య‌మైంద‌ని చెప్పారు. రూ. 23 వేల కోట్ల వ్యయంతో ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు.

1,205 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

దిగుబ‌డి అయిన మొత్తం ధాన్యంలో 80 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నులు కొనుగోలు చేస్తామ‌ని, ఇందులో సన్నాలు 40 లక్షల మెట్రిక్ టన్నులు , దొడ్డు ర‌కాలు 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యించింద‌ని మంత్రి వెలిపారు. ఈ ధాన్యాన్ని 8342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా సేక‌రిస్తామ‌న్నారు. ఇందులో ఐ కే పి 3517, పి.ఏ.సి.ఎస్ 4259, ఇతర ప్రాంతాలలో 566 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, నల్లగొండ జిల్లాలో 1205 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామ‌ని మంత్రి ఉత్త‌మ్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామ‌న్నారు.

ఈ నెల 16న స‌మీక్ష‌

ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై ఈ నెల 16 న హైద‌రాబాద్ నుంచి ప్రత్యేక సమీక్ష నిర్వ‌హిస్తామ‌ని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల లో అనుసరించల్సిన విధి విధానాలను క్షేత్ర స్థాయిలో అధికారులకు ఇప్ప‌టికే పంపించామన్నారు. వానాకాలం కొనుగోళ్ల ప్రక్రియను ఈ నెల మొదటి తేదీ నుండి ప్రారంభించాని, జనవరి రెండో వారం నాటికి పూర్తి అవుతాయని చెప్పారు. యాదాద్రి భునగిరి జిల్లాలో రెండు లక్షల 83 వేల 18 ఎకరాల విస్తీర్ణంలో జరిగిన సాగులో 7.79 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదవ్, శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామ్యోల్, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,ఇ. ఎన్.సి అంజద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.