Telangana Fee Reimbursement Dues| మలుపు తిరిగిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల వివాదం!
తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల వివాదం కీలక మలుపు తిరిగింది. బకాయిల విడుదల కోరుతూ సోమవారం నుంచి కాలేజీల బంద్ ను ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు కొనసాగిస్తున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం విజిలెన్స్ కమిషన్ నివేదిక ను తెరపైకి తేవడంతో ఈ వివాదం మరో మలుపు తీసుకుంది.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల(Telangana Fee Reimbursement Dues) వివాదం కీలక మలుపు తిరిగింది. దాదాపు రూ.8వేల కోట్ల ఫీజురీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్ బకాయిలు పెండింగ్ లో ఉండటంతో కాలేజీల నిర్వహణ కష్టాసాధ్యమైందంటూ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు బంద్(Private Colleges Strike)కు దిగాయి. కనీసం ఇప్పటికే ఇచ్చిన టొకెన్ల మేరకు రూ.1200కోట్లు విడుదల చేసి..మిగతా బకాయిలు ఏడాదిలోగా చెల్లిస్తామని హామీ ఇస్తే తాము బంద్ విరమించుకుంటామని యాజమాన్యాలు తెలిపారు. కాలేజీల యాజమాన్యాలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రి డి.శ్రీధర్ బాబు జరిపిన చర్చలు విఫలమవ్వగా..సోమవారం నుంచి కాలేజీల బంద్ ను ప్రైవేటు కళాశాలల యజమాన్యాలు కొనసాగిస్తున్నాయి.
తెరపైకి విజిలెన్స్ కమిషన్ నివేదిక
కళాశాలల బంద్ సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సోమవారం డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబులు చర్చలు జరుపుతున్నారు. కళాశాలల తీరుపై గుర్రుగా ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ఫీజు రీయంబర్స్ మెంట్ దుర్వినియోగంపై చర్యలు తీసుకోవడం ద్వారా వారిని దారిలోకి తెచ్చుకోవాలని యోచిస్తుంది. ఇందుకు గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల అవతవకలపైన..నాణ్యత ప్రమాణాలపైన నియమించిన విజిలెన్స్ కమిషన్ నివేదికను(Vigilance Commission Report) బయటకు తీసి..దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని భావిస్తుందన్న ప్రచారం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలను మరింత కలవర పెడుతుంది.
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని..అనుమతుల సమయంలో కోట్ల రూపాయాలు చేతులు మారుతున్నాయని..ఫ్యాక్ట్ చెకింగ్ కమిటీలు నామమాత్ర తనిఖీలు చేస్తూ యాజమాన్యాలకు కొమ్ము కాస్తున్నాయన్న ఆరోపణలను ప్రభుత్వం పరిశీలించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది.
నివేదిక ఆధారంగా చర్యలకు విద్యార్థి సంఘాల డిమాండ్
నకిలీ ప్రొఫెసర్లతో అప్రూవల్స్ పొందుతున్నారని..తగిన బోధన ప్రమాణాలు, నాణ్యత పాటించకుండా ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని వినియోగించుకుంటున్న కాలేజీలు..విద్యార్థులకు సౌకర్యాలు కల్పించకుండా..టీచింగ్ సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వకుండా కోట్లు మిగిల్చుకుంటున్నాయని విజిలెన్స్ కమిషన్ గతంలో గుర్తించింది. నాలుగు నెలలుగా పల్లవి, శ్రీనిధి కాలేజీలు స్టాఫ్ కు జీతాలు ఇవ్వని విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో కాలేజీలు ఫీజు రీయంబర్స్ మెంట్ పేరుతో ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయని..విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ను బయటకి తీసి వాటిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram