CM Revanth Reddy| దేశ ప్రగతికి గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ : సీఎం: రేవంత్ రెడ్డి

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం
తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ‘తెలంగాణ రైజింగ్ 2047’
విధాత, హైదారాబాద్: భారత్ దేశం స్వాతంత్య్ర సాధన శత వసంతాలు పూర్తి చేసుకునే 2047 నాటికి దేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్ర(Game changer role)లో తెలంగాణ(Telangana) కీలకంగా ఉండాలన్నదే మా ప్రభుత్వ సంకల్పమని..ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే ‘తెలంగాణ రైజింగ్(Telangana Rising) 2047’ అని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) పేర్కొన్నారు. శుక్రవారం దేశ స్వాంతంత్య్ర దినోత్సవ వేడుకల(Independence Day) సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేసి ప్రసంగించారు. తెలంగాణను 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా..2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మార్చే మహత్తర లక్ష్య పత్రంగా తెలంగాణ రైజింగ్ 2047 ఉంటుందని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రణాళిక కాదు..ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పం అని..ఇది యావత్ తెలంగాణ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్(Master Plan)అని రేవంత్ రెడ్డి చెప్పారు. మూసీ పునరుజ్జీవం నుంచి మొదలై గ్రామీణ తెలంగాణ వ్యవసాయ వికాసం వరకు ఈ విజన్ లో విస్పష్టంగా ఉండబోతోందన్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న హైదరాబాద్ ను… స్వచ్ఛమైన, సుందరమైన నగరంగా మార్చే సంకల్పాన్ని ఈ విజన్ ఆవిష్కరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుతో హైదారాబాద్ వరద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించే హామీని ఈ విజన్ డాక్యుమెంట్ ఇస్తుందని..అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమయ్యే భారత్ ఫ్యూచర్ సిటీ… ఆధునిక ప్రపంచానికి గేట్ వేగా ఏ విధంగా ఉంటుందో ఈ పత్రం వెల్లడిస్తుందని తెలిపారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే రీజినల్ రింగ్ రోడ్డు తెలంగాణ అభివృద్ధికి రాచమార్గంగా ఎలా నిలవబోతోందో తెలంగాణ రైజింగ్ – 2047 లో విస్పష్టంగా చెప్పబోతున్నామన్నారు.
మన బలం హైదరాబాద్ అని..ప్రపంచ వేదికపై మన బ్రాండ్ హైదరాబాద్ ను మరింత విస్తరించేందుకు పలు అంతర్జాతీయ ఈవెంట్లను హైదరాబాద్ లో నిర్వహించేలా నిర్ణయాలు తీసుకున్నాం అన్నారు. ఇందులో భాగంగా దేశంలోనే మొదటి సారి…గత ఏడాది హైదరాబాద్ లో వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సదస్సు నిర్వహించాం. బయోఏషియా, గ్లోబల్ రైస్ సమ్మిట్, అంతర్జాతీయ రాజకీయ సదస్సు భారత్ సమ్మిట్– 2025, 72వ మిస్ వరల్డ్ వంటి పోటీను నిర్వహించామని.. ఈ అన్నీ వేదికల నుండి మనం తెలంగాణ విజన్ “తెలంగాణ రైజింగ్ – 2047”ను ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేశామని తెలిపారు. వచ్చే డిసెంబర్ లో ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు.
కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోం
తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామని..కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత పాలకుల నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే…శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందని చెప్పారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా.. ఆ ఎత్తులను చిత్తు చేస్తాం అని..ప్రజల దృష్టి మరల్చేందుకు సెంటిమెంట్ రగిలించాలన్న కొందరి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. కుట్రలను ఛేదించి రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం అన్నారు.
సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు
2023 డిసెంబర్ 7న మేము బాధ్యతలు స్వీకరించగానే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించామని..ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశామని..సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని..కుల గణనతో బలహీనవర్గాల వందేళ్ల కలను నిజం చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణతో దశాబ్ధాల నిరీక్షణకు తెరదించాం అని..ఇవి గొప్ప నిర్ణయాలు మాత్రమే కాదు… అత్యంత సాహసోపేత నిర్ణయాలు కూడా అన్నారు. ఒక వైపు ప్రపంచ నగరాలతో పోటీ పడే లక్ష్యాలు నిర్దేశించుకుని..మరో వైపు పేదల ఆకాంక్షలు తీర్చే సంక్షేమ ఫలాలు అందిస్తు..ద్విముఖ విధానంతో మా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ తెలంగాణను 20 నెలల కాలంలోనే దేశానికి రోల్ మోడల్ గా నిలబెట్టాం అని..ఇదే మేం తెచ్చిన మార్పు అని రేవంత్ రెడ్డి చెప్పారు.
సంక్షేమానికి కేరాఫ్ కాంగ్రెస్ పాలన
దేశ స్వాతంత్య్రానికి ..పునర్ నిర్మాణానికి కృషి చేసిన మహానీయుల ఆశయాలకు అనుగుణంగా సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ ప్రజాపాలన సాగిస్తుందని..ధనికులతో సమానంగా పేదలు కూడా సన్న బియ్యం భోజనం చేసేలా 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది కేవలం ఆకలి తీర్చే పథకం కాదు..ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పథకం అని అభివర్ణించారు. అలాగే కొత్త రేషన్ కార్డుల అందిస్తున్నామని. అన్నదాతల సంక్షేమానికి రూ.1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర రాశామని..ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు శాపాలై వెంటాడుతున్నా… రైతుల విషయంలో రాజీ పడలేదని స్పష్టం చేశారు. “ఇందిరమ్మ రైతు భరోసా” కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం కింద కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లను రాష్ట్రంలోని 70 లక్షల, 11 వేల, 184 మంది రైతులకు ఈ సాయం అందించామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1.2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. దేశంలోనే అత్యధిక ధాన్యం పండిస్తున్న తెలంగాణ రైతుల కోసం 7,178 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి చివరి గింజ వరకు ధాన్యం కొన్నాం. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ లో భాగంగా 29 లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని..దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నామని తెలిపారు.
సామాజిక న్యాయంలో కీలక అడుగులు
సామాజిక న్యాయం సాధన క్రమంలో సమగ్ర కులగణన చేసి స్థానిక సంస్థలలో…విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించుకున్నామన్నారు. రాష్ట్ర శాసన వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. మనం పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించాం అని.గ్రూప్- 1 లో 15, గ్రూప్ -2 లో 18, గ్రూప్ -3 లో 26 కులాలను చేర్చాం అన్నారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ‘తెలంగాణ సోషల్ జస్టిస్ డే’ గా జరుపుకోవాలని నిర్ణయించామని తెలిపారు.
20 నెలల కాలంలో 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం
20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యారోగ్య రంగంపై 16 వేల 521 కోట్ల రూపాయలు వ్యయం చేశాం..27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నయా ఉస్మానియా ఆస్పత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నాం. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నాం. పేదల కోసం తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నాం. రాష్ట్రంలోని నాలుగు ఐటీడీఏ ప్రాంతాల్లో 22,016 ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 నుండి 10 లక్షలకు పెంచాం. తెలంగాణ శక్తికి ప్రతీకయైన యువతను గడచిన పదేళ్లలో మత్తుకు బానిసలను చేసే కుట్ర జరిగిందని..ఇవ్వాళ డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనకు ఈగల్ పేరుతో ఏర్పాటైన వ్యవస్థ రాష్ట్రం మూల మూలలా పనిచేస్తుందన్నారు. మహిళా ఉన్నతి-తెలంగాణ ప్రగతి అనే నినాదంతో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసేందుకు మొత్తంగా 46,689 కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. మహాలక్ష్మీ పథకంలో ఆర్టీసీ ఉచిత బస్సు వసతి కల్పించి 200కోట్ల జీరో టికెట్లతో ఆడబిడ్డలకు రూ.6790 కోట్లు ఆదా చేశామని తెలిపారు.